ట్వంటీ20 స్పాట్ ఫిక్సింగ్: మరొకరి అరెస్ట్

24 Feb, 2017 15:22 IST|Sakshi
ట్వంటీ20 స్పాట్ ఫిక్సింగ్: మరొకరి అరెస్ట్

లండన్: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లను అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ పై దృష్టిపెట్టిన బ్రిటన్ జాతీయ నేర విభాగం షెఫీల్డ్ లో స్థానిక పౌరుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి బెయిల్ పై విడుదలనట్లు తెలిపింది. ఫిబ్రవరి 13న పాక్ క్రికెటర్లు నాసిర్ జంషెడ్, యూసఫ్ లను అదుపులోకి తీసుకోగా రెండు రోజుల అనంతరం ఏప్రిల్ వరకు బెయిల్ మంజూరు కావడంతో బయటకొచ్చారు.

పీఎస్ఎల్ కు సంబంధించి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డార్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు పాక్ క్రికెటర్లు షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ లకు రెండు వారాల గడువిస్తూ వివరణ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. గత శనివారం పీసీబీ ఈ ఇద్దరు క్రికెటర్ల విషయాన్ని మీడియాకు వెల్లడించింది. మరోవైపు ఫిక్సింగ్ ఆరోపణలతో పీసీబీ ఇదివరకే.. ఇస్లామాబాద్ యూనైటెడ్ ప్లేయర్ షార్జిల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ ను సస్పెండ్ చేసింది.

పీఎస్ఎల్ లో పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై బ్రిటన్ ఎన్సీఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఫిక్సింగ్ కు సంబంధం ఉందన్న ఆరోపణలతో మరికొందరిపై నిఘా పెట్టింది. షార్జిల్, లతీఫ్ మాత్రం తమకు ఫిక్సింగ్ తో ఎలాంటి సంబంధాలు లేవని, తమపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆటగాళ్ల ఫిక్సింగ్ వివరాలపై మాట్లాడేందుకు పీసీబీ నిరాకరిస్తోంది.

>
మరిన్ని వార్తలు