అమ్మ కొడుకులు

16 May, 2019 07:32 IST|Sakshi
రాధ, సాయికిరణ్, శ్రీనుబాబు

నమ్మకాన్ని నిలబెట్టారు  

చదువు, జాతీయ క్రీడల్లో రాణిస్తున్న అన్నదమ్ములు

బంజారాహిల్స్‌: అక్షరం అమ్మయింది.. ఆత్మవిశ్వాసం తోడయింది.. లక్ష్యంపై గురి పెట్టారు.. విజయం చేరువైంది.. ఆ పేదింట పదింతల ఆనందం వెల్లివిరిసింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి వాసంశెట్టి సాయి కిరణ్‌ ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో విజయం సాధించాడు. చాలామందిలో ఇతడూ ఒకడు అనుకోవద్దు.. ఈ కుర్రాడు జాతీయ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుడు. అండర్‌–17 జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాడు. అంతేకాదు.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌)లో ఉంటూ అంతర్జాతీయ పోటీలకు శిక్షణ పొందుతున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు క్రీడల్లో రాణిస్తున్నాడు. ఇతడి అన్న వాసంశెట్టి శ్రీనుబాబు మొన్నటి ఇంటర్‌ ఫలితాల్లో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతడు కూడాజాతీయ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుడే కావడంవిశేషం. ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం ‘సాయ్‌’ హాస్టల్‌లో ఉంటూ అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్నారు. 

తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం  
సాయికిరణ్, శ్రీనుబాబుల తల్లి రాధ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని కొత్తూరు స్వగ్రామం. విధి వికటించి ఎనిమిదేళ్ల క్రితం రాధ భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ నగరానికి చేరుకుంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7లో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని సమీప ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం చూసుకుంది. ఆపై తన ఇద్దరు పిల్లలకు పక్కనే ఉన్న గతి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. తల్లి కష్టాన్ని గుర్తించి సాయికిరణ్, శ్రీనుబాబు చదువుల్లో రాణిస్తునే మరోవైపు క్రీడలపైనా దృష్టిపెట్టారు. తాము చదువుతున్న స్కూలు తరఫున జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఆడటంతో మంచి గుర్తింపు పొందారు. ఈ క్రీడా ప్రతిభతోనే శ్రీనుబాబు మంచి కాలేజీలో సులువుగానే అడ్మిషన్‌ పొందాడు. ఇదిలావుంటే.. ‘సాయ్‌’లో సీటు సంపాదించడం అషామాషీ కాదు. ఇందులో శిక్షణ పొందుతున్న వారిలో హైదరాబాద్‌ నుంచి ఎంపికైనవారిని వేళ్ల మీద లెక్కబెట్టువచ్చు. కానీ శ్రీనుబాబు, సాయికిరణ్‌ ఇద్దరూ ఇందులో తమ క్రీడా పతిభతో చోటు సంపాదించుకున్నారు. ఓ వైపు చదువుతూనే ఇంకోవైపు క్రీడల్లో దూసుకెళుతున్నారు. తన బిడ్డలను ఉన్నతంగా చూడాలనుకున్న రాధ ఆశను నిజం చేస్తున్నారు. చదువులోనూ.. క్రీడల్లోనూ రాణిస్తూ గుర్తింపు పొందుతూ రేపటి భవిష్యత్‌ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆ దిగులు పోయింది
నేను బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇళ్లల్లో పనిచేస్తూ నా కొడుకులను సర్కారు బడిలోనే చదివించాను. ఇద్దరూ ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. ఇంకోవైపు ఆటల్లోను రాణిస్తున్నారు. ఒకపూట పస్తులుండి వారికి అవసరమైన క్రీడా సామగ్రితో పాటు పోటీలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఖర్చులు కూడా ఇచ్చాను. నా కష్టాన్ని వారు గుర్తించారు. నా కొడుకుల విజయాల ముందు భర్త లేడన్న దిగులు దూరమైపోయింది.    – రాధ, సాయికిరణ్, శ్రీనుబాబు తల్లి

>
మరిన్ని వార్తలు