'మేము కూడా రియోకు రాలేం'

31 Jul, 2016 15:56 IST|Sakshi
'మేము కూడా రియోకు రాలేం'

న్యూయార్క్:ఇటీవల బ్రెజిల్లో వెలుగు చూసిన జికా వైరస్ కారణంగా పలువురు అగ్రశ్రేణ క్రీడాకారులు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెనుకడుగు వేస్తున్నారు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ డబుల్స్ జోడీ గా పేరుగాంచిన బ్రయాన్ బ్రదర్స్ రియో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అక్కడ ప్రబలిని ప్రాణాంతక జికా వైరస్ కారణంగా ఆ మెగా టోర్నీకి దూరమవుతున్నట్లు బ్రయాన్ జంట స్పష్టం చేసింది.

 

'మేము రియో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నాం. జికా వైరస్తో ఎటువంటి రిస్క్ చేయదలుచుకోలేదు. కుటుంబ సభ్యుల ఆరోగ్యమే మా తొలి ప్రధాన్యత' అని ఈ జోడి స్పష్టం చేసింది. ఈ మేరకు రియో ఒలింపిక్స్ విషయాన్ని తమ ఫేస్ బుక్ అకౌంట్లో  బ్రయాన్ ద్వయం  పోస్ట్ చేసింది. ఇప్పటివరకూ ఈ అమెరికా జోడి 112 టైటిల్స్ తమ ఖాతాలో వేసుకోగా, 16 గ్రాండ్ స్లామ్లను సొంతం చేసుకుంది. గత లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలిచి సత్తా చాటింది.


జికా వైరస్ భయంతో ఇప్పటికే కొంతమంది టాప్ అథ్లెట్లు  రియోకు గుడ్ బై చెప్పారు. వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్లతో పాటు, చెక్ రిపబ్లిక్కు చెందిన వరల్డ్ ఎనిమిదో ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు టామస్ బెర్డిచ్, అదే దేశానికి చెందిన కరోలినా ప్లిస్కోవాలు రియో నుంచి వైదొలిగారు.

మరిన్ని వార్తలు