బుమ్రా మరో రికార్డు

24 Aug, 2019 10:50 IST|Sakshi

ఆంటిగ్వా: టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మరో రికార్డు సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో యాభై వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డును బుమ్రా బ్రేక్‌ చేశాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఈ ఫీట్‌ నమోదు చేశాడు.  విండీస్‌ ఆటగాడు డారెన్‌ బ్రేవో వికెట్‌ను తీయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో 50వ వికెట్‌ మార్కును చేరాడు. ఈ ఘనతను సాధించడానికి బుమ్రాకు 2,465 బంతులు అవసరం కాగా, అశ్విన్‌ 2,597 బంతులతో ఇప్పటివరకూ అగ్రస్థానంలో కొనసాగాడు.

తాజాగా దాన్ని బుమ్రా సవరిస్తూ భారత్‌ తరఫున కొత్త రికార్డును లిఖించాడు. అదే సమయంలో టెస్టుల పరంగా చూస్తే 50 వికెట్లను వేగవంతంగా సాధించిన బౌలర్‌గా కూడా బుమ్రా రికార్డు సాధించాడు. ఇప్పటివరకూ వెంకటేష్‌ ప్రసాద్‌, మహ్మద్‌ షమీ పేరిట సంయుక్తంగా ఈ రికార్డు ఉండగా,  దాన్ని సైతం బుమ్రా బద్ధలు కొట్టాడు. వీరిద్దరూ 13వ టెస్టులో 50వ టెస్టు వికెట్‌ను సాధించగా, బుమ్రా 11వ టెస్టులో దాన్ని బ్రేక్‌ చేయడం ఇక్కడ మరో విశేషం.

ఈ మ్యాచ్‌లో భారత్‌ పట్టుబిగించింది. రెండో రోజు ఆటలో భాగంగా ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లతో చెలరేగడంతో విండీస్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దాంతో భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు