'ఆ ఇద్దరి వల్లే మా ప్లాన్ దెబ్బతింది'

25 Sep, 2017 16:35 IST|Sakshi

ఇండోర్: మూడో వన్డేలో తమ జట్టు భారీ స్కోరు చేయకపోవడానికి టీమిండియా ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రాలే కారణమని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. తమకు ఏ దశలోనూ వారు పరుగులు చేసే అవకాశాన్ని ఇవ్వలేదన్నాడు. ప్రధానంగా స్లాగ్ ఓవర్లలో ఆ ఇద్దరి బౌలింగ్ లో పరుగులు రాబట్టడానికి ఆసీస్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నాడు. కచ్చితంగా భువీ, బూమ్రాలు అత్యుత్తమ డెత్ బౌలర్లని స్మిత్ ఈ సందర్భంగా కొనియాడాడు.

'నిన్నటి మ్యాచ్ లో మా బ్యాట్స్మన్ అనవసరంగా తప్పుడు షాట్లకు పోయారు. ఇక్కడ చెడ్డ బంతుల్లో వికెట్లను సమర్పించుకోవడం బాధనిపించింది. ఓవరాల్ గా టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో బూమ్రా, భువీలు మమ్మల్ని పరుగులు చేయకుండా నిలువరించారు. దాంతోనే మేము అనుకున్న స్కోరును బోర్డుపై ఉంచలేకపోయాం. ఆ ఇద్దరి వల్లే మా ప్లాన్ పూర్తిగా దెబ్బతింది. మమ్మల్సి సులువుగా పరుగులు తీయకుండా నియంత్రించారు. దాంతో దూకుడుడా ఆడాల్సి వచ్చింది. వారిద్దరూ అత్యుత్తమ డెత్ ఓవర్ల స్పెషలిస్టులు'అని స్మిత్ పేర్కొన్నాడు.

మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ స్కోరు 37.4 ఓవర్లలో 224/1. అప్పటికే ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ వీర బాదుడుతో శతకం సాధించి జట్టును అత్యంత పటిష్టమైన స్థితికి చేర్చగా, అతనితో పాటు క్రీజులో స్మిత్‌ ఉన్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా బ్యాటింగ్‌ చేయాల్సి ఉండటంతో స్కోరు 350 వరకు చేరుతుందేమో అని అంతా భావించారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు వారిని ఓ ఆటాడుకున్నారు. వరుస బంతుల్లో స్మిత్, మ్యాక్సీ పెవిలియన్‌కు చేరడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఫలితంగా చివరి 10 ఓవర్లలో జట్టు కేవలం 59 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆఖరి ఐదు ఓవర్లను బౌలింగ్ వేసిన బూమ్రా, భువనేశ్వర్ లు 38 పరుగులిచ్చి ఆసీస్ స్కోరు మూడొందల దాటకుండా కట్టడి చేశారు.

మరిన్ని వార్తలు