బుమ్రా బంతి.. వాహ్‌!

25 Feb, 2019 11:09 IST|Sakshi

విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ ఓడినా.. పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ మాత్రం అద్భుతమనిపించింది. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్‌ వేసిన బుమ్రా మూడు వికెట్లు సాధించి 16 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత తరఫున తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు సాధించింది బుమ్రానే.  ముఖ్యంగా 19వ ఓవర్లో అతడి బౌలింగ్‌ అమోఘం. ఆ ఓవర్‌ ఐదో బంతికి హ్యాండ్‌ స్కాంబ్‌ను ఔట్‌ చేసిన బుమ్రా.. ఆరో బంతికి కౌల్టర్‌ నైల్‌ను బౌల్డ్‌ చేశాడు. ముఖ్యంగా కౌల్టర్‌నైల్‌ను బౌల్డ్‌ చేసిన బంతి గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను వేసిన ఇన్‌స్వింగ్‌ యార్కర్‌కు కౌల్టర్‌నైల్‌ దగ్గర సమాధానమే లేదు. వికెట్‌ ఎగిరి ఎక్కడో పడింది. ఆ స్థానంలో ఎంత బ్యాట్స్‌మన్‌ ఉన్నా ఆడటం బౌల్డవ్వాల్సిందే అనిపించింది ఆ బంతి చూస్తే.  ఆ ఓవర్‌లో రెండు పరుగులే ఇవ్వడం ఇక్కడ మరో విశేషం. (ఇక్కడ చదవండి: టీమిండియా విలన్‌ ఉమేశ్‌ యాదవ్‌!)

అయితే ఆ మరుసటి ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ ఆసీస్‌ విజయానికి కావాల్సిన పరుగులు సమర్పించుకోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.  ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆసీస్‌ మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ విజయానికి చివరి ఓవర్‌లో 14 పరుగులు కావాలి. 16వ ఓవర్లో వికెట్‌ పడగొట్టి..  రెండే పరుగులిచ్చిన ఉమేశ్‌ చేతిలో బంతి. ఇక భారత్‌ విజయం లాంఛనమే అనిపించింది. తొలి బంతికి కమిన్స్‌ సింగిల్‌. రెండో బంతిని డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో బౌండరీకి తరలించాడు రిచర్డ్‌సన్‌. తర్వాతి బంతికి 2 పరుగులు. నాలుగో బంతికి సింగిల్‌. 2 బంతుల్లో 6 పరుగులు చేయాలి. ఆఫ్‌ స్టంప్‌ ఆవల ఉమేశ్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని కమిన్స్‌ కవర్స్‌లో బౌండరీకి తరలించాడు. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి.  వికెట్లను లక్ష్యంగా చేసుకుని వేసిన బంతిని కమిన్స్‌ స్ట్రెయిట్‌గా ఆడాడు. ఆ బంతికి రెండు పరుగులు పూర్తి చేయడంతో ఆసీస్‌ సంబరాల్లో మునిగిపోయింది.(ఇక్కడ చదవండి: గెలుపు గోవిందా)

మరిన్ని వార్తలు