బుమ్రా నయా వరల్డ్‌ రికార్డు

3 Feb, 2020 11:54 IST|Sakshi

మౌంట్‌మాంగని: టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నయా వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అత్యధిక మెయిడిన్‌ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డు లిఖించాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐదో మ్యాచ్‌లో మూడు వికెట్లు సాధించడంతో పాటు 12 పరుగులే ఇచ్చి ఒక మెయిడిన్‌ ఓవర్‌ను సంధించాడు. దాంతో తన ఇంటర్నేషనల్‌ టీ20 కెరీర్‌లో ఏడో మెయిడిన్‌ నమోదు చేశాడు. ఫలితంగా అత్యధిక టీ20 మెయిడిన్‌ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే శ్రీలంక బౌలర్‌ నువాన్‌ కులశేఖర రికార్డును బ్రేక్‌ చేశాడు. తన 58 మ్యాచ్‌లు సుదీర్ఘ టీ20 కెరీర్‌లో నువాన్‌ కులశేఖర ఆరు మెయిడిన్‌ ఓవర్లు వేయగా, దాన్ని బుమ్రా బద్ధలు కొట్టాడు. నిన్న కివీస్‌తో ఆఖరి టీ20 మ్యాచ్‌ బుమ్రాకు 49వది. (ఇక్కడ చదవండి: అదొక స్పెషల్‌ ఫీలింగ్‌.. సెకండ్‌ డ్రీమ్‌: రాహుల్‌)

కివీస్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.దాంతో న్యూజిలాండ్‌పై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తొలి జట్టుగా రికార్డుకెక్కింది. అదే సమయంలో టీ20 చరిత్రలో ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమి లేకుండా ఒక జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక రోహిత్‌ శర్మ సైతం ఒక రికార్డును సాధించాడు. టి20ల్లో అత్యధికసార్లు 50 అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 25 సార్లు అతడీ ఘనత సాధించాడు. దీంతో విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన 5వ టి20లో రోహిత్‌ శర్మ 60 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకోవడంతో అతడి పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఇప్పటివరకు 108 టి20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ నాలుగు సెంచరీలు, 21 అర్ధశతకాలతో 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన వారిలో అందరికంటే ముందున్నాడు. కోహ్లి 24 అర్ధశతకాలు సాధించాడు. (ఇక్కడ చదవండి: టీమిండియా క్లీన్‌స్వీప్‌)

మరిన్ని వార్తలు