బుమ్రా గాయంపై బీసీసీఐ అప్‌డేట్‌

1 Oct, 2019 11:00 IST|Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయంపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఓ ప్రకటనను విడుదల చేసింది.  బుమ్రాకు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించేందుకు యూకే పంపుతున్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘ తదుపరి చికిత్స కోసం బుమ్రాను లండన్‌కు పంపుతున్నాం. అతని వెంట ఎన్సీఏ హెడ్‌ ఫిజియోథెరపిస్ట్‌ ఆశిస్‌ కౌశిక్‌ వెళుతున్నారు. బుమ్రాను ముగ్గురు నిపుణులతో కూడిన బృందం వేర్వేరుగా పర‍్యవేక్షిస్తుంది. మరో రెండు-మూడు రోజుల్లో లండన్‌కు వెళ్లనున్నారు. అక్కడ డాక్టర్ల అభిప్రాయం తీసుకుంటాం.

దాన్ని బట్టి బుమ్రా ప్రణాళిక ఏమిటనేది ఉంటుంది. బుమ్రా గాయం(స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌) నుంచి ఎన్ని రోజులకు తేరుకుంటాడనేది లండన్‌కు వెళ్లిన తర్వాత స్పష్టత వస్తుంది’ అని సదరు అధికారి పేర్కొన్నారు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి బుమ్రా వైదొలిగిన సంగతి తెలిసిందే. దాంతో అతను తేరుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. బంగ్లాదేశ్‌తో జరుగనున్న తదుపరి సిరీస్‌లో కూడా బుమ్రా పాల్గొనడం అనుమానంగా ఉంది. తన మూడున్నరేళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో బుమ్రాకు ఇది తొలి మేజర్‌ గాయం కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు