‘జస్‌ప్రీత్‌ బుమ్రాతో చాలా డేంజర్‌’

20 Jul, 2020 10:20 IST|Sakshi

140 కి.మీ వేగంతో హడలెత్తిస్తాడు: లబూషేన్‌

బ్రిస్బేన్‌: టీమిండియా పేస్‌ బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రానే కఠినమైన బౌలర్‌ అని అంటున్నాడు ఆసీస్‌ క్రికెటర్‌ మార్కస్‌ లబూషేన్‌. ఇటీవల నిలకడగా రాణిస్తూ ఆసీస్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయిన లబూషేన్‌.. బుమ్రా చాలా డేంజర్‌ అని అభిప్రాయపడ్డాడు.2020–21 సీజన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన కాంట్రాక్ట్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న లబూషేన్‌. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటించే అవకాశం ఉండటంతో బుమ్రాపై లబ్‌షేన్‌ ప్రశంసలు కురిపించాడు. ‘గంటకు 140 కి.మీల వేగంతో నిలకడా బౌలింగ్‌ చేయగల సత్తా బుమ్రాది. పరిస్థితులు అనుకూలిస్తే బంతిని ఇరువైపులా స్వింగ్‌ను రాబట్టడంలో కూడా బుమ్రా దిట్ట. అందుకే బుమ్రా బౌలింగ్‌ ఆడటం చాలా కష్టం. (టి20 ప్రపంచకప్‌ భవితవ్యం తేలేది నేడే)

భారత్‌ పేస్‌ దళం చాలా మెరుగ్గా ఉంది. అందులో బుమ్రా ప్రమాదకర బౌలర్‌. నీకు నువ్వు  బ్యాట్స్‌మన్‌గా పరీక్షించుకోవాలంటే బుమ్రా బౌలింగ్‌ను ఆడితేనే సత్తా బయటకొస్తుంది. టీమిండియా పేస్‌ దళానికి బుమ్రానే లీడర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను భారత్‌లో ఒకే టెస్టు మ్యాచ్‌ ఆడాను. గతంలో సిడ్నీ మ్యాచ్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడా. నాకు భారత్‌ బౌలింగ్‌ను ఆడటంలో కొద్దిపాటి అనుభవం మాత్రమే ఉంది. ఇక పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడటానికి భారత్‌కు వచ్చా. టెస్టుల్లో పరంగా చూస్తే భారత్‌ బౌలింగ్‌ను చాలా తక్కువగానే ఆడాను. టీమిండియా పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌లో ఇషాంత్‌ శర్మ కూడా బాగా మెరుగయ్యాడు. రాబోయే సిరీస్‌ల్లో భారత​ నుంచి బాగా గట్టి పోటీ తప్పదు’ అని బ్రిస్బేన్‌లో పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో లబూషేన్‌ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడిన లబూషేన్‌ 63పైగా యావరేజ్‌తో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.    

గతేడాది లార్డ్స్‌ మైదానంలో యాషెస్‌ రెండో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ గాయపడటంతో లబూషేన్‌ కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్‌ సెంచరీతో మెరిసి ఆసీస్‌ను ఆదుకున్నాడు. దాంతో స్మిత్‌ జట్టులో ఉన్నప్పటికీ లబూషేన్‌ రెగ్యులర్‌ ఆటగాడు అయిపోయాడు. తనకు ఇచ్చిన వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు లబూషేన్‌. ఆపై పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల్లో భారీ శతకాలు సాధించి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు.ఈ ఏడాది ఆరంభంలోనే డబుల్‌ సెంచరీ బాదేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. 

మరిన్ని వార్తలు