నైకీ ఎక్కడ...? 

26 Feb, 2019 01:00 IST|Sakshi
విజయ్‌ శంకర్‌ పేరుతో ఉన్న జెర్సీ ధరించిన బుమ్రా

సాక్షి, విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో తొలి టి20లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన జస్‌ప్రీత్‌ బుమ్రా జెర్సీని గమనించారా? వెనక వైపు అతని పేరు ఉండాల్సిన చోట స్టిక్కర్‌ అంటించి ఉంది. దాని నంబర్‌ కూడా 59... రెగ్యులర్‌గా బుమ్రా జెర్సీ నంబర్‌ 93. ఆదివారం మీడియాకు ఇచ్చిన టీమ్‌ జాబితాలో కూడా నంబర్‌ 93 అనే రాసి ఉంది. కానీ మైదానంలో బుమ్రా మాత్రం అది వేసుకోలేదు. ఆ టీ షర్ట్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ది. అతను తన తొలి మ్యాచ్‌ నుంచి 59 నంబర్‌నే వాడుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే న్యూజిలాండ్‌లో జరిగిన టి20ల్లో కూడా రోహిత్‌ శర్మ విజయ్‌ శంకర్‌ జెర్సీ 59తో ...ఆ తర్వాత హార్దిక్‌ పాండ్యా జెర్సీ 33తో బరిలోకి దిగాడు. అంటే భారత కెప్టెన్‌ కూడా తన పేరు లేకుండానే ఆడాడు.

కొత్త ఆటగాళ్లంటే ఏమో స్టార్‌ ప్లేయర్ల కోసం కూడా ఇలా టీ షర్ట్‌లు సిద్ధం కాకపోవడం చిత్రంగా ఉంది. భారత జట్టు వన్డేలు, టి20ల్లో వేర్వేరు జెర్సీలతో ఆడుతుందనేది అందరికీ తెలిసిందే. టీమ్‌ అపెరల్‌ పార్ట్‌నర్‌ నైకీ వీటిని అందజేయాల్సి ఉంటుంది. అయితే మరి నిర్లక్ష్యమో, మరే కారణమో కానీ టి20 టీమ్‌కు అవసరమైన జెర్సీలు సిద్ధం కానట్లుంది. ఏదో ఒకటిలే పని కానిచ్చేద్దాం అన్నట్లు మన ఆటగాళ్లు కూడా       ఈ విషయాన్ని గానీ, టి20 మ్యాచ్‌లను గానీ సీరియస్‌గా తీసుకోలేదేమో. న్యూజిలాండ్‌ టి20ల్లోనైతే జట్టులో సగం మంది ఇలా స్టిక్కర్లు అంటించి లేదా వన్డే డ్రెస్‌తోనే ఆడేశారు. ఒక దశలో కామెంటేటర్లు కూడా   దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ విషయంలో ఎంతో కచ్చితంగా వ్యవహరించే బీసీసీఐ ఈ అంశంపై మాత్రం దృష్టి   పెట్టకపోవడం ఆశ్చర్యకరం.  

మరిన్ని వార్తలు