‘బుమ్రాతో జర జాగ్రత్త’

5 Feb, 2019 14:30 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టులో ప్రధాన బౌలర్‌ పాత్ర పోషిస్తున్న జస్ప్రిత్‌ బుమ్రాపై దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రపంచ టాప్‌ ఆటగాళ్లకు సైతం బుమ్రా చుక్కలు చూపిస్తున్నాడని సచిన్‌ కొనియాడాడు... రాబోవు వరల్డ్‌కప్‌లో మరింత ప్రమాదకర బౌలర్‌గా ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించడం ఖాయమన్నాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో బుమ్రాతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు.

‘ ఎప్పటికప్పుడు బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న బుమ్రా సక్సెస్‌ నాకేమీ ఆశ్చర్యం కల్గించడం లేదు. నేను అతనితో గడిపిన సమయాల్లో బూమ్రాలో ఒక నిజాయితీ చూశా. ప్రధానంగా బౌలింగ్‌లో పరిణితి సాధించడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లను సైతం బుమ్రా తన బౌలింగ్‌తో బోల్తా కొట్టించడం ప్రశంసనీయం. అతనొక వైవిధ్యమైన బౌలర్‌. నిలకడగా వికెట్లు సాధించడం అతని కచ్చితమైన బౌలింగ్‌కు నిదర్శనం. అదే అతన్ని ప్రమాదకరమైన బౌలర్‌గా నిలబెట్టింది. ఏ ప్రణాళికలతో మైదానంలోకి దిగుతాడో దాన్ని అమలు చేయడంలో బుమ్రా దిట్ట. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే భారత జట్టుకు బూమ్రా పెద్ద ఆస్తి. ప్రత్యర్థి జట్లకు బూమ్రా బౌలింగ్‌తో పెను ప్రమాదం పొంచి ఉంది’ అని సచిన్‌ విశ్లేషించాడు. మరొకవైపు యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను సచిన్‌ కొనియాడాడు. ఎటువంటి భయలేకుండా క్రికెట్‌ ఆడుతున్న పంత్‌కు తానొక అభిమానిగా పేర్కొన్నాడు. ఎంజాయ్‌ చేస్తూ క్రికెట్‌ ఆడే రిషభ్‌కు మంచి భవిష్యత్తు ఉందని సచిన్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు