ఇంగ్లండ్ రికార్డు విజయం

10 Jun, 2015 14:57 IST|Sakshi
ఇంగ్లండ్ రికార్డు విజయం

బర్మింగ్ హామ్: జాస్ బట్లర్, జో రూట్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రికార్డు విజయం సాధించింది. కివీస్ ను భారీ తేడాతో చిత్తు చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లీషు సేన 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. 1975 ప్రపంచకప్ లో భారత్ ను 202 పరుగుల తేడాతో ఓడించిన రికార్డును ఇంగ్లండ్ చెరిపేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇంగ్లీషు టీమ్ నిర్దేశించిన 409 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన కివీస్ సేన 31.1 ఓవర్లలో 198 పరుగులకే చాపచుట్టేసింది. రాస్ టేలర్(57) టాప్ స్కోరర్ గా నిలిచాడు. విలియమ్సన్ 45 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్, ఆదిల్ రషీద్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు. జొర్డాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జాస్ బట్లర్ (105 బంతుల్లో 129; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), జో రూట్ (78 బంతుల్లో 104; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన శతకాలతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డేల్లో ఇంగ్లండ్ కు ఇదే అత్యధిక స్కోరు. బట్లర్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

>
మరిన్ని వార్తలు