థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ టోర్నీ మళ్లీ వాయిదా

30 Apr, 2020 05:14 IST|Sakshi

ఆగస్టులో బదులుగా అక్టోబర్‌లో నిర్వహణ

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగా ఈవెంట్‌ డెన్మార్క్‌ వేదికగా మే 16 నుంచి 24 వరకు జరగాల్సింది. అయి తే కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన టోర్నీని వాయిదా వేసి... ఆగస్టు 15 నుంచి 23 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోవడం... ఆగస్టు చివరి వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమిగూడవద్దని డెన్మార్క్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టులో బదులుగా థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టోర్నీ కొత్త షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 3 నుంచి 11 వరకు జరుగుతుందని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. పురుషుల, మహిళల విభాగాల్లో 16 మేటి జట్ల చొప్పున పాల్గొనే ఈ టోర్నీలో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత సాధించాయి.   
 

మరిన్ని వార్తలు