హైదరాబాద్‌ ఓపెన్‌తో బీడబ్ల్యూఎఫ్‌ సీజన్‌ పునః ప్రారంభం

23 May, 2020 00:01 IST|Sakshi

ఐదు నెలల్లో 22 టోర్నమెంట్‌లు

తాజా షెడ్యూల్‌పై భారత క్రీడాకారుల అసంతృప్తి

న్యూఢిల్లీ: కరోనా కారణంగా మూలకు పడిన టోర్నమెంట్‌లను నిర్వహించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సిద్ధమైంది. ఈ మేరకు పలు టోర్నీల సవరించిన షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్‌ ఓపెన్‌తో మళ్లీ బ్యాడ్మింటన్‌ సందడి మొదలు కానుంది. హైదరాబాద్‌ ఓపెన్‌ కాకుండా... సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ టోర్నీ (నవంబర్‌ 17–22), ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ (డిసెంబర్‌ 8–13) కూడా భారత్‌లో జరుగనున్నాయి.

నిజానికి ఇండియా ఓపెన్‌ మార్చి 24–29 వరకు జరగాల్సి ఉండగా కరోనా ధాటికి వాయిదా పడింది. సవరించిన క్యాలెండర్‌ ప్రకారం బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ స్థాయి టోర్నీలు తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 (సెప్టెంబర్‌ 1–6)తో ప్రారంభం కాను న్నాయి. అనంతరం డెన్మార్క్‌ ఓపెన్‌ (అక్టోబర్‌ 3–11) జరుగనుంది.  వీటితో పాటు 8 ప్రముఖ అంతర్జాతీయ టోర్నీలను రీషెడ్యూల్‌ చేశారు. అయితే బీడబ్ల్యూఎఫ్‌ సవరించిన షెడ్యూల్‌పై భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల కాలంలో ఏకంగా 22 అంతర్జాతీయ టోర్నీలు ఉండటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆటగాళ్లు ఇంకా ప్రాక్టీసే ప్రారంభించలేదని... ప్రాక్టీస్‌ మొదలుపెట్టాక మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సంతరించుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని సాయిప్రణీత్‌ అన్నాడు.

మరిన్ని వార్తలు