కాంస్యంతో సరిపెట్టిన ప్రణీత్‌

24 Aug, 2019 18:14 IST|Sakshi

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్‌ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో 13-21,8-21 తేడాతో 19వ ర్యాంకర్, తెలంగాణ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ ఓటమి చవిచూశాడు. ఆరంభంలో నువ్వా నేనా అన్నట్టు ఇద్దరూ తలపడ్డారు. దీంతో తొలి గేమ్‌ హోరాహోరీగా సాగింది. ఓ దశలో తొలి గేమ్‌లో ఇద్దరూ 10-10 పాయింట్లతో సమానంగా నిలిచారు. అనంతరం మొమోటా తన అనుభవంతో పాటు అసలు సిసలైన చాంపియన్‌ ఆటను ప్రదర్శించాడు. దీంతో మొమోటా ముందు సాయి ప్రణీత్‌ తేలిపాయాడు. ఇక రెండో గేమ్‌లోనూ మొమోటా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. దీంతో ప్రణీత్‌కు ఓటమి తప్పలేదు.   

దీంతో ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టిస్తాడనుకున్న ప్రణీత్‌ కాంస్యంతోనే సరిపెట్టాడు. దీంతో భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్‌ పదుకొనే సరసన చేరాడు. 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రకాశ్‌ పదుకొనే కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. 36ఏళ్ల అనంతరం పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మళ్లీ పతకం అందించనున్న ప్లేయర్‌గా సాయిప్రణీత్‌ చరిత్ర లిఖించాడు. మరోవైపు మహిళ సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్‌ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. 

మరిన్ని వార్తలు