వచ్చే వరల్డ్కప్ వరకూ అతనే కోచ్!

10 Apr, 2017 12:42 IST|Sakshi
వచ్చే వరల్డ్కప్ వరకూ అతనే కోచ్!

మెల్బోర్న్: ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ డారెన్ లీమన్ పదవీ కాలాన్ని పొడగించారు. 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ లీమన్నే కోచ్ గా కొనసాగించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ) నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా లీమన్ దిశా నిర్దేశంలో ఆస్ట్రేలియా సిరీస్ విజయాలను సాధిస్తూ దూసుకుపోతోంది. గత వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు లీమన్ కోచ్ గా వ్యహరించాడు. దాంతో పాటు ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ వంటి పటిష్ట దేశాలపై ఆసీస్ పలు విజయాలను నమోదు చేసి సిరీస్లను కైవసం చేసుకుంది.

 

మరోవైపు టెస్టు, వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆసీస్ కు లీమనే సరైన మార్గదర్శకుడిగా భావించిన ఆ జట్టు యాజమాన్యం అతనికే తిరిగి పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఏ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోగార్డ్ తాజా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.'ఆస్ట్రేలియా జట్టు కోచ్, అసిస్టెంట్ కోచ్లను మార్చే ఉద్దేశం ఇప్పట్లో లేదు. వచ్చే యాషెస్తో పాటు వన్డ్డే వరల్డ్ కప్ వరకూ లీమన్ కోచ్ గా కొనసాగుతాడు. మా జట్టులో విజయమంతమైన కోచ్గా లీమన్ గుర్తింపు సాధించాడు. అందుకు మరోసారి అతనికే కోచ్ పగ్గాలు అప్పజెప్పాలని జాతీయ సెలక్షన్ ప్యానెల్ నిర్ణయించింది' అని హోగార్డ్ తెలిపారు.

మరిన్ని వార్తలు