అప్పుడు మరిచాం.. ఈసారి ఉండాల్సిందే!

21 Mar, 2020 14:28 IST|Sakshi

సిడ్నీ: ఇటీవల ముగిసిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో రిజర్వ్‌ డేలు లేకుండానే నిర్వహించారు. ప్రధానంగా నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేలు లేకపోవడం అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ(ఐసీసీ)ని నవ్వులు పాలు చేసింది. ఈ మెగా టోర్నీ నిర్వహించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) కూడా నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ప్రస్తావన తేకపోవడంతో ఐసీసీ కూడా తేలిగ్గా తీసుకుంది. కనీసం సోయి లేకుండా ఒక మేజర్‌ టోర్నీని నిర్వహించారనే అపవాదు అటు ఐసీసీతో పాటు ఇటు సీఏపై కూడా పడింది.  మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌-భారత్‌ల మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దానికి రిజర్వ్‌ డే లేని కారణంగా రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న టీమిండియా ఫైనల్‌ చేరింది. (మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్‌పై మోదీ ఇలా..)

ఇది ఇంగ్లండ్‌కు శాపంలా మారింది. మ్యాచ్‌ ఆడకుండానే టోర్నీని సెమీస్‌తోనే ముగించడం ఇంగ్లండ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. కాకపోతే వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇంగ్లండ్‌ భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, వచ్చే అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా పురుషుల టీ20  వరల్డ్‌కప్‌ జరుగనుంది. దీనికి కచ్చితంగా రిజర్వ్‌ డే ప్రతిపాదనను సీఏ సిద్ధం చేసింది. ఐసీసీ నిర్వహించబోయే సమావేశంలో నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే ప్రస్తావన తీసుకురానుంది. మహిళల వరల్డ్‌కప్‌కు రిజర్వ్‌డే ప్రతిపాదనను మరిచిన సీఏ.. ఈసారి మాత్రం ఆ తప్పిదం చేయకూడదనే భావనలో ఉంది. రాబోవు వరల్డ్‌కప్‌కు రిజర్వ్‌ డే ప్రతిపాదనను క్రికెట్‌ కమిటీ మీటింగ్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.  (థాంక్యూ చాంపియన్‌: బీసీసీఐ)

మరిన్ని వార్తలు