నిషేధం ఎత్తేసే ముచ్చటే లేదు!

20 Nov, 2018 11:00 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

మెలోబోర్న్‌: ‘ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను’అంటోంది క్రికెట్‌ ఆస్ట్రేలియా. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని మంగళవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. గత కొంతకాలంగా ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ అసోషియేషన్‌(ఏసీఏ) ఆ ముగ్గురు క్రికెటర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతోంది. మంగళవారం చైర్మన్‌ ఎడ్డింగ్స్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. క్రికెట్‌కు, దేశానికి మాయని మచ్చ తెచ్చిన ఆ క్రికెటర్లను ఉపేక్షించేది లేదని సమావేశం తర్వాత ఎడ్డింగ్స్‌ పేర్కొన్నారు. (గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన స్టీవ్‌ స్మిత్‌)

ఇంటా బయట ఓటములతో ఆస్ట్రేలియా గడ్డుకాలాన్ని ఎదుర్కోంటోంది. ఈ తరుణంలో జట్టులో సమతుల్యం దెబ్బతిన్నదని, కీలక టీమిండియా పర్యటన నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌లపై ఉన్న నిషేధాన్ని సడలించాలని ఏసీఏ కోరుతోంది. అయితే ఆటగాళ్లపై నిషేధాన్ని సడలిస్తే భవిష్యత్‌ క్రికెట్‌కు మంచిది కాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఏ ప్రకటించింది. దీనిపై  ఏసీఏ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్‌ పరిస్థితుల కంటే కన్నా వారి పంతమే ముఖ్యమని సీఏ భావిస్తోందని దుయ్యబట్టారు. (అందుకు సిగ్గుపడుతున్నా: వార్నర్‌)

కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌, వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధాన్ని విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. దీంతో స్మిత్‌, వార్నర్‌లపై నిషేధం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుండగా, బాన్‌క్రాఫ్ట్ పై నిషేధం జనవరిలో తొలగనుంది.


 

మరిన్ని వార్తలు