కోహ్లికి అవమానంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆగ్రహం

5 Jan, 2019 12:00 IST|Sakshi

సిడ్నీ: అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఆసీస్‌ ప్రేక్షకులు తమ వెకిలి చేష్టలతో అవమానించారు. తాజాగా సిడ్నీ వేదికగా జరుగుతున్న నాల్గో టెస్టులోనూ కోహ్లీకి అటువంటి అనుభవమే ఎదురైంది. కోహ్లి బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు ఆసీస్ అభిమానులు అతడిని వెక్కిరిస్తూ విపరీత వ్యాఖ్యలు చేసి అనుచితంగా ప్రవర్తించారు. ఈ రెండు ఘటనలపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒక ఆతిథ్య జట్టుకు కనీస గౌరవం ఇవ్వాలనే విషయాన్ని మరచిపోతే ఎలా అంటూ సదరు అభిమానులపై మండిపడింది. ఇది ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఒక మచ్చగా మిగిలిపోతుందని అభిప్రాయపడింది. దయచేసి ఇక నుంచి అటువంటి అనుచిత ప్రవర్తనను కట్టిపెట్టి మర్యాదగా ప్రవర్తించాలని ఆసీస్‌ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ‘ దేశానికి వచ్చిన అతిథులను ఇలా అవమానించడం సరికాదు. అతిథులను గౌరవించడం నేర్చుకోవాలి. మనందరికంటే ఆట గొప్పది. అతిథులను మనం గౌరవించాలి. మన దేశానికి వచ్చినప్పుడు వారికి అందమైన అనుభవం ఇవ్వాలి. అయితే, మైదానంలో మాత్రం కలబడాలి’ అని ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్  పేర్కొన్నాడు.  ఇలాంటి చర్యలను పునరావృతం చేయవద్దని అభిమానులకు హితవు పలికాడు.

మరిన్ని వార్తలు