దాదా మరో నిర్ణయం: మోదీ, షేక్‌ హసీనాలకు ఆహ్వానం!

17 Oct, 2019 09:55 IST|Sakshi

కోల్‌కతా: అన్నీ కుదిరితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలు ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌ రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌లో పర్యటించనుంది. దీనిలో భాగంగా నవంబర్‌ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆతిథ్యమివ్వనుంది. అయితే చారిత్రాత్మక మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్టు. దీంతో ఈ టెస్టుకు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్న ఈ టెస్టును వీక్షించాల్సిందింగా ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాలకు ఆహ్వానం పంపాలని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నిర్ణయించాడు. 

దీనిలో భాగంగా క్యాబ్‌ తరుపున ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక సౌరవ్‌ గంగూలీ క్యాబ్‌ అధ్యక్షుడయ్యాక వినూత్న ఆలోచనలతో ఈడెన్‌ గార్డెన్స్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. లార్డ్స్‌ మాదిరిగా ఈడెన్‌లోను గంట కొట్టి మ్యాచ్‌ ప్రారంభించే ఆనవాయితీని గంగూలీ ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా 2016లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన క్యాబ్‌ ఆయన చేత జాతీయ గీతం పాడించింది.  ప్రస్తుత పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా క్యాబ్‌ ఆహ్వానం మేరకు మ్యాచ్‌కు హాజరయ్యాడు. చివరగా మొహాలీ వేదికగా  ప్రపంచకప్‌-2011 సెమీఫైనల్‌లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అప్పటి ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, యూసఫ్‌ రజా గిలానీలు ప్రత్యక్షంగా తిలకించారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా