‘క్యాబ్’ అధ్యక్షుడిగా గంగూలీ

25 Sep, 2015 00:11 IST|Sakshi
‘క్యాబ్’ అధ్యక్షుడిగా గంగూలీ

సంయుక్త కార్యదర్శిగా అవిషేక్ దాల్మియా
 
కోల్‌కతా: బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కొత్త అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో క్యాబ్ సీనియర్ అధికారులతోపాటు రాష్ర్ట మంత్రులతో జరిగిన సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు. దివంగత అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్ దాల్మియాకు సంయుక్త కార్యదర్శి పదవి ఖరారైంది. మరో కార్యదర్శి పదవిలో సుబీర్ గంగూలీ, కోశాధికారిగా బిశ్వరూప్ డే కొనసాగుతున్నారు. గంగూలీ నియమాక నిర్ణయం పూర్తిగా క్యాబ్ అధికారులు తీసుకున్నదేనని, కేవలం దానికి తాను మద్దతిచ్చానని మమత స్పష్టం చేశారు. ‘దాల్మియా మరణం తర్వాత క్యాబ్‌లో పెద్ద లోటు ఏర్పడింది.

ఎవరో ఒకరు క్యాబ్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలి. క్రికెట్ అంటే దాల్మియాకు చాలా ఆసక్తి. అందుకని ఆయనకు దగ్గరైన వ్యక్తి, క్రికెట్‌తో సంబంధం ఉన్న వారు అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని భావించాం. గంగూలీ నియామకంలో ప్రభుత్వ జోక్యం లేదు. అధికారుల నిర్ణయాన్ని సమర్థించాం. కాబట్టి మీ అందరూ కలిసికట్టుగా పని చేసి జగ్‌మోహన్ వారసత్వాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా. దాదా విషయాన్ని నేను ప్రకటించాల్సింది కాదు. కానీ అందరూ విజ్ఞప్తి చేస్తే ఒప్పుకున్నా. సౌరవ్ చాలా ఏళ్లు భారత జట్టును నడిపించాడు. ఇప్పుడు మిగతా సహచరులతో కలిసి క్యాబ్‌ను తీర్చిదిద్దుతాడని భావిస్తున్నా’ అని సమావేశంలో మమతా వ్యాఖ్యానించారు. క్యాబ్ ఎన్నికలు జరిగే 2016 జూలై వరకు గంగూలీ ఈ పదవిలో కొనసాగుతారు.
 అవిషేక్‌కు జాక్‌పాట్
 ఈ మొత్తం ఎపిసోడ్‌లో జూనియర్ దాల్మియా పెద్ద జాక్‌పాటే కొట్టాడు. ఎందుకంటే పరిపాలనలో ఎలాంటి అనుభవం లేకపోయినా సౌరవ్, మమత చలువతో సంయుక్త కార్యదర్శి పదవిని చేజిక్కించుకున్నాడు. ఇక బయటకు చెప్పకపోయినా అధ్యక్ష పదవిపై గంపెడాశలు పెట్టుకున్న బిశ్వరూప్, సుబీర్‌లు మాత్రం దాదా నియామకంతో పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారు. ఎన్నికలు జరిగితే ఏదో రకంగా మేనేజ్ చేసుకుని  క్యాబ్ పగ్గాలు చేపట్టాలని మొదట్నించి ఈ ఇద్దరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అలాగే సచివాలయంలో ఈ ప్రకటన చేయడం, అధ్యక్ష పదవిని వివాదం చేయొద్దని సమావేశంలో మమత పదేపదే వ్యాఖ్యానించడం కూడా వీరికి మింగుడుపడటం లేదు.
 
 ఇదో కొత్త సవాలు: గంగూలీ
 క్యాబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం కొత్త సవాలని గంగూలీ అన్నారు. ‘అవిషేక్ క్యాబ్‌లోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతనికి ఇది భావోద్వేగ సమయం. బిశ్వరూప్, సుబీర్‌లతో కలిసి పని చేయడంలో ఎలాంటి సమస్య లేదు. మాకు 117 సంఘాల మద్దతు ఉంది. వాళ్లతో కలిసి ముందుకెళ్తాం’ అని దాదా పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు బాధ్యతలు స్వీకరించినా వచ్చే నెల 8 నుంచి పని మొదలుపెడతానని చెప్పారు.
 

మరిన్ని వార్తలు