‘కోహ్లికి అలా సూచించడంలో అర్థం లేదు’

18 Mar, 2020 09:20 IST|Sakshi

ముంబై: మైదానంలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూకుడుకు ఎంతమంది అభిమానుల ఉన్నారో అదే స్థాయిలో విమర్శకులు ఉన్నారన్నది వాస్తవం. అయితే, ఆట సమయంలో అతని ప్రవర్తన, దూకుడు తనకెంతో ఇష్టమని భారత మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ సలహాదారు కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్‌ అన్నాడు. కోహ్లి సహజ లక్షణం అయిన దూకుడును తగ్గించుకోవాలని అందరూ సూచించడంలో అర్థం లేదని పేర్కొన్నాడు. భారత్‌కు కోహ్లినే సరైన కెప్టెన్‌ అని అభిప్రాయపడ్డాడు.
(చదవండి: కోహ్లి, సానియాకు చాలెంజ్‌ విసిరిన సింధు)

‘కోహ్లి దూకుడు తగ్గించుకోవాలని అందరూ ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడేమో భారత్‌కు దూకుడైన కెప్టెన్‌ అవసరం ఉందన్నారు. ఇప్పుడేమో కోహ్లిని ఆవేశం తగ్గించుకోమని సూచిస్తున్నారు. టీమిండియాకు దూకుడుగా ఉండటం రాదనేవారు. ప్రస్తుతం ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మనకు కోహ్లిలాంటి కెప్టెనే సరైనవాడు. మైదానంలో అతని ఆట, ప్రవర్తించే తీరు నాకు నచ్చుతుంది. అతని దూకుడును నేను ఆస్వాదిస్తా’అని మదన్‌లాల్‌ వివరించాడు.

ఇటీవలి న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా రెండో టెస్టులో విలియమ్సన్‌ అవుటయ్యాక కోహ్లి కాస్త అతిగా స్పందించడంతో అతని దూకుడు చర్చకు దారితీసింది. ఈ పర్యటనలో కోహ్లి అరుదైన రీతిలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి కేవలం 38 పరుగులు.. టీ20, వన్డేలు, టెస్టుల్లో ఒకే ఒక అర్థసెంచరీ నమోదు చేశాడు. దీనిపై స్పందిస్తూ ‘న్యూజిలాండ్‌ పర్యటనలో విఫలమైనంత మాత్రానా కోహ్లి కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఇప్పటికీ అతనే ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు. ప్రతీ ఆటగాడికి ఏదో ఒక దశలో ఇలాగే జరుగుతుంది. ఈ సమయంలో అతను ఫామ్‌ కోల్పోయాడంతే’అని లాల్‌ అన్నాడు.
(చదవండి: దృఢంగా ఉండండి వ్యాప్తి చెందకుండా చూడండి)

మరిన్ని వార్తలు