అయ్యో బీసీసీఐ.. ఇలా అయితే ఎలా?

17 Aug, 2019 11:05 IST|Sakshi

ముంబై: ‘కోచ్‌గా రవి భాయ్‌ను కొనసాగిస్తే సంతోషం’... వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్తూవెళ్తూ కోహ్లి చేసిన వ్యాఖ్య ఇది. వీటిని బట్టి చూసినా, వన్డే ప్రపంచ కప్‌తోనే గడువు ముగిశాక 45 రోజుల పొడిగింపు ఇవ్వడాన్ని బట్టి లెక్కగట్టినా వాస్తవానికి కాబోయే కోచ్‌ ఎవరో అప్పుడే స్పష్టమైపోయింది. కానీ, ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నట్లు చెప్పుకొనేందుకు బీసీసీఐ... టీమిండియా కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఓ గడువు పెట్టి వాటిని వడపోసింది. మరీ విడ్డూరంగా కపిల్‌ స్థాయి వ్యక్తితో సలహా కమిటీని వేసింది. దాని నియామకంపై భిన్నాభిప్రాయాలతో పాటు మధ్యలో క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) జోక్యం సరేసరి.

తీరా అంతా అయ్యాక చూస్తే  రవిశాస్త్రికే అవకాశం ఇచ్చింది. ఇంతోటిదానికి హెసన్‌ రెండో స్థానంలో, మూడీ మూడో స్థానంలో నిలిచారని ప్రకటించి నవ్వు తెప్పించింది.  ఇది వచ్చేది కాదు పోయేది కాదని అర్ధమై ఇంటర్వ్యూకు ముందు సిమన్స్‌ తప్పుకోగా రాబిన్‌సింగ్, రాజ్‌పుత్‌ హాజరు వేయించుకుని వెళ్లినట్లైంది.పైగా బోర్డు అధికారిక ప్రకటనలో హెసన్‌ పేరు కూడా తప్పుగా రాశారంటే దీనిని ఏమాత్రం సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతుంది.

దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘కోచ్‌ పదవి కోసం పోటీపడ్డ అభ్యర్థి పేరును కూడా సరిగా రాయకపోవడమే, ఎంపిక అనేది ఎంత పారదర్శంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చని ఒక అభిమాని విమర్శించగా,  ‘కనీసం హెసన్‌ స్పెల్లింగ్‌ను గూగుల్‌లో వెతకాల్సింది’ అని మరొకరు చురకలంటిచారు. ఇలా సోషల్‌ మీడియాలో కోచ్‌ ఎంపికపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. మరొకవైపు భారత క్రికెట్‌లో కోహ్లి అంతకంత బలవంతుడయ్యాడని...! కెప్టెన్‌ మాటను జవదాటి పోలేని స్థితికి బోర్డు చేరిందనే విషయం అర్థమవుతోంది. (ఇక్కడ చదవండి: రవిశాస్త్రినే రైట్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా