మాకొద్దీ బీసీసీఐ బాధ్యతలు... 

10 Jul, 2020 02:24 IST|Sakshi

సుప్రీం కోర్టుకు ‘కాగ్‌’ విజ్ఞప్తి  

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి తమ ప్రతినిధిని తప్పించాలని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఆఫ్‌ ఇండియా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. బోర్డు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు ఒక స్వతంత్ర ప్రతినిధిని అపెక్స్‌ బృందంలో నియమించింది. ‘కాగ్‌’ తరఫున అల్కా రెహాని భరద్వాజ్‌ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 17న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి ‘అర్హులైన’ వ్యక్తులు మాత్రమే హాజరయ్యేలా చూ డాలని గత శనివారం అల్కా భరద్వాజ్‌ బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆమె నేరుగా ఎవరి పేరూ చెప్పకపోయినా బోర్డు కార్యదర్శి జై షాను ఉద్దేశించే ఇలా చేసినట్లు తెలుస్తోంది. కొత్త నియమావళి ప్రకారం బోర్డులో గానీ, రాష్ట్ర సంఘంలో గానీ కలిపి వరుసగా ఆరేళ్లు ఆఫీస్‌ బేరర్‌గా పని చేసిన వ్యక్తులు తమ పదవుల్లో కొనసాగడానికి అనర్హులు. ఇలాంటి స్థితిలో బీసీసీఐలో భాగంగా ఉంటూ పని చేయలేమని ‘కాగ్‌’ సుప్రీంను అభ్యర్థించింది.

జోహ్రి నిష్క్రమణ 
బీసీసీఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ జోహ్రి తన పదవినుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. మూడు నెలల క్రితం ఆయన ఇచ్చిన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. గతంలోనే ఆయన తన పదవిని వీడేందుకు సిద్ధమైనా... అందుకు బోర్డు అంగీకరించలేదు. జోహ్రి పదవీ కాలం 2021 వరకు ఉండగా, అప్పుడే ఆయన రాజీనామా చేయడం విశేషం. దీనికి బోర్డు అధికారులు ఎలాంటి కారణం చూపలేదు. అయితే జోహ్రి ఇటీవల కావాలనే బోర్డు అంతర్గత ఇ–మెయిల్స్‌ను బయటపెట్టారని, బోర్డు ఆయనపై నమ్మకం కోల్పోయిందని తెలుస్తోంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా