కేంబ్రిడ్జ్ ఎలెవన్ 154 ఆలౌట్

31 Jul, 2014 23:48 IST|Sakshi

 నిప్పులు చెరిగిన ఖాద్రీ
 ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్
 
 సాక్షి, హైదరాబాద్: ఎస్‌బీహెచ్ బౌలర్లు సమష్టిగా విజృంభించడంతో కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా చేతులెత్తేశారు. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో గురువారం రెండో రోజు ఆటలో కేంబ్రిడ్జ్ తొలి ఇన్నింగ్స్‌లో 49.3 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. మీర్ జావిద్ అలీ (75 బంతుల్లో 60, 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఎస్‌బీహెచ్ బౌలర్లలో అహ్మద్ ఖాద్రీ (3/7) నిప్పులు చెరిగాడు. ఆకాశ్ భండారి, అశ్విన్ యాదవ్, రవికిరణ్ తలా 2 వికెట్లు తీశారు. దీంతో ఎస్‌బీహెచ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగుల ఆధిక్యం లభించింది.
 
  తర్వాత ఫాలోఆన్ ఆడిన కేంబ్రిడ్జ్ జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు ఆడి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. అంతకుముందు 290/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఎస్‌బీహెచ్ 74 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అర్ధసెంచరీలు చేసిన ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఖాద్రీ (66), ఆకాశ్ భండారి (58) త్వరగా ఔటైనప్పటికీ  కేఎస్‌కే చైతన్య 37 పరుగులు చేశాడు. కేంబ్రిడ్జ్ బౌలర్ తనయ్ త్యాగరాజన్ 4 వికెట్లు తీశాడు.
 
 రెండో రోజూ వర్షార్పణం
 ఆంధ్రాబ్యాంక్, దక్షిణ మధ్య రైల్వే జట్ల మధ్య రెండో రోజు ఆట కూడా వర్షం వల్ల పూర్తిగా రద్దయింది. మైదానం ఆటకు ప్రతికూలంగా ఉండటంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈఎంసీసీ, ఫలక్‌నుమా జట్ల మధ్య రెండో రోజు ఆటసాగలేదు. తొలి రోజు కేవలం 32 ఓవర్లపాటు ఆట జరిగిన సంగతి తెలిసిందే. ఫలక్‌నుమా వికెట్ కోల్పోకుండా 99 పరుగులు చేసింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 221 (మోహిత్ మన్ 53; శబరీష్ 4/53, శివశంకర్ 2/18, రజత్ రమేశ్ 2/78), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 35/2
 
 కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 447/3 (శాండిల్య 123, ఆరోన్ పాల్ 124 బ్యాటింగ్, వైభవ్ 75 బ్యాటింగ్) ఆర్.దయానంద్‌తో మ్యాచ్
 ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 139/7 (అరుణ్ దేవా 58; అన్వర్ అహ్మద్ ఖాన్ 3/36, పాండే 2/54)
 ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 69/1 (మహంతి 33 బ్యాటింగ్)
 

మరిన్ని వార్తలు