నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..

26 Jul, 2019 17:40 IST|Sakshi

సిడ్నీ : యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో నిషేధం ఎదుర్కొని జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌ ఎట్టకేలకు పిలుపునందుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషేస్‌ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 17 మంది సభ్యులు గల జట్టులో చోటుదక్కించుకున్నాడు. బెన్‌క్రాఫ్ట్‌తో ఆసీస్‌ సీనియర్‌ ఆటగాళ్లు ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లు సైతం శిక్షను అనుభవించినప్పటికీ.. ప్రపంచకప్‌ టోర్నీతో వారిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశారు. బెన్‌క్రాఫ్ట్‌ నిషేధం 9 నెలల్లోనే ముగిసినప్పటికీ ఆసీస్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. యాషెస్‌ సిరీస్‌ కోసం టిమ్‌ పెయిన్‌ నేతృత్వంలోని 17 మంది సభ్యుల గల జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టులో మిచెల్‌ నెసెర్‌ అనే అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ చోటు దక్కించుకున్నాడు.

‘25 మంది ఆటగాళ్ల జాబితాను 17 మందికి కుదించడం చాలా కష్టమైన పని. ఈ సిరీస్‌ కోసం అద్భుతంగా సాధన చేశాం. ఇందులో 8 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా-ఏ తరఫున గత నెలరోజులుగా ఇంగ్లండ్‌లో ఆడుతున్నారు. ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో ఆడిన ఆరుగురిని తీసుకున్నాం. కౌంటీ క్రికెట్‌ ఆడిన మరో ముగ్గురిని ఎంపిక చేశాం. తొలి టెస్ట్‌కు సిద్ధంగా ఉండేలా చూసుకున్నాం’ అని ఆసీస్‌ జాతీయ సెలక్టర్‌ ట్రెవర్‌ హోన్స్‌ తెలిపారు. ఇక 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం ఆసీస్‌ జట్టును ప్రపంచం ముందు దోషులగా నిలబెట్టింది. దీంతో ఆటగాళ్లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా కఠిన శిక్షలు విధించడం.. శిక్షణ కాలం ముగిసి పునరాగమనం చేయడం తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా