నా ఆనందాన్ని ఒక్క క్షణంలో చిదిమేసింది: యువీ

13 Oct, 2018 15:12 IST|Sakshi

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ విజయం తర్వాత క్యాన్సర్‌ ఉందని తెలియడం తన ఆనందాన్ని ఒక్క క్షణంలో చిదిమేసిందని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. కొంతకాలంగా పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువీ... ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో భాగమైన విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీలోనూ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన యువరాజ్ మొత్తం 264 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో యువరాజ్ మాట్లాడుతూ ‘వరల్డ్‌కప్ విజయం తర్వాత క్యాన్సర్‌ ఉందని తెలియడం నా ఆనందాన్ని ఒక్క క్షణంలో చిదిమేసింది. అవి నా జీవితంలో చీకటి రోజులు. నువ్వు వరల్డ్‌కప్ గెలిచినప్పుడు, నువ్వు మ్యాన్‌ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైనప్పుడు శిఖరాన్ని అధిరోహించినట్టు ఉంటుంది. కానీ, అకస్మాత్తుగా అగాథంలోకి పడిపోయా. జీవితం ఇంతే. ఏం జరుగుతుందో తెలియదు. మరో అవకాశమే ఇవ్వదు’ అని యువరాజ్ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు.

సెలక్ట్‌ కావడం అనేది నా చేతుల్లో లేదు

ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటుదక్కించుకోవడం అనేది తన చేతుల్లో లేదన్నాడు. తనకు 2019 వరల్డ్‌కప్‌లో ఆడాలనే కోరిక ఉందని, అదే లక్ష్యంతో దేశవాళీ మ్యాచ్‌ల్లో రాణించడానికి వందశాతం యత్నిస్తున్నానని తెలిపాడు. కాకపోతే తాను సెలక్ట్‌ కావడం అనేది మేనేజ్‌మెంట్‌ చేతుల్లో ఉంటుందన్నాడు. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.ఈ టోర్నీలో మొత్తం 362 పరుగులు చేసిన యువరాజ్ 15 వికెట్లు తీశాడు. ఆ తర్వాత క్యాన్సర్‌ బారిన పడ్డాడు. కాగా,  2017లో టీమిండియాలోకి పునరాగమనం చేసిన యువీ..ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 150 పరుగులతో సత్తాచాటాడు. దీంతో మళ్లీ అతడి కెరీర్‌ గాడిన పడిందని అంతా భావించారు. కానీ, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనల్లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.

మరిన్ని వార్తలు