చెస్‌కు చెక్‌!

27 Mar, 2020 06:30 IST|Sakshi
టోర్నీలో భాగంగా జరిగిన గేమ్‌ సందర్భంగా రష్యా ఆటగాళ్లు కిరిల్‌ అలెక్‌సీన్‌కో, నెపొమ్‌నియాచి ఇలా...

క్యాండిడేట్స్‌ టోర్నీ నిలిపివేత

మాస్కో: కరోనా విలయతాండవంలోనూ దానికి సంబంధం లేనట్లుగా జరుగుతున్న ఒకే ఒక్క పెద్ద క్రీడా ఈవెంట్‌ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ. ఇందులో విజేతగా నిలిచిన ఆటగాడు ప్రపంచ చెస్‌ టోర్నమెంట్‌లో నార్వే సూపర్‌ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో తలపడతాడు. అయితే ఇప్పుడు ఇది కూడా ఆగిపోయింది. రష్యాలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో ఉన్నపళంగా టోర్నీని నిలిపివేయక తప్పలేదు. శుక్రవారం (ఈ నెల 27) నుంచి విమాన రాకపోకల్ని నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టోర్నీని కొనసాగిస్తే... ఈవెంట్‌ ముగిశాక వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు స్వదేశం చేరే అవకాశాలు మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఈవెంట్‌ను నిలిపివేసింది.

‘ఫిడే ఈ టోర్నమెంట్‌ను ఇలాగే  కొనసాగిస్తే ఆటగాళ్లు, అధికారులు, ఇతరత్ర సిబ్బందిని నిర్ణీత గడువులోగా వారి స్వదేశాలకు పంపలేదు. ఈ నేపథ్యంలో ‘ఫిడే’ నిబంధనల మేరకు ఈవెంట్‌ను నిలిపివేయాలని నిర్ణయించాం’ అని ఫిడే అధ్యక్షుడు అర్కడి వొర్కవిచ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 7 రౌండ్లు జరిగాయి. మాక్సిమ్‌ వాచియెల్‌ (ఫ్రాన్స్‌), ఇయాన్‌ నెపొమ్‌నియాచి (రష్యా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నారు. తిరిగి మొదలైతే 8వ రౌండ్‌ నుంచి కొనసాగిస్తారు. భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ‘కోవిడ్‌–19’ వల్లే జర్మనీలో ఇరుక్కుపోయాడు. విదేశీ ప్రయాణ ఆంక్షలతో అక్కడే ఆగిపోయాడు. దీంతో అతను క్యాండిడేట్స్‌ చెస్‌కు ఆన్‌లైన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. 

మరిన్ని వార్తలు