ధోనికి ఏమిస్తే సరిపోతుంది: గంగూలీ

6 Dec, 2019 14:40 IST|Sakshi

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత క్రికెట్‌ జట్టుకు దూరంగా ఉంటున్న  మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రిటైర్మెంట్‌ గురించి రోజు ఏదొక వార్త హల్‌చల్‌ చేస్తూనే ఉంది. తనను జనవరి వరకూ క్రికెట్‌ గురించి ఏమీ అడగొద్దని ధోని స్పష్టం చేసినా అతని భవిష్య ప్రణాళికపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి స్పష్టతనిచ్చారు.

‘ ధోని భవిష్య ప్రణాళికపై అతనికే వదిలిపెడదాం. దాని గురించి నేను పట్టించుకోవడం లేదు. అది టీమిండియా క్రికెట్‌ అధికారులు, సెలక్షన్‌ కమిటీ చూసుకుంటుంది. ధోని రిటైర్మెంట్‌ అంశాన్ని ప్రస్తుతానికి వదిలేద్దాం. నేనేమీ చెప్పలేను. నేను బీసీసీఐ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత ధోని చర్చించా.  దానిపై టీమిండియా సెలక్టర్టు నిర్ణయం తీసుకుంటారు. భారత క్రికెట్‌కు ధోని చాలా చేశాడు. అతనికి బీసీసీఐ ఏమిస్తే సరిపోతుంది. కేవలం థాంక్స్‌తో అతని సేవలకు ముగింపు చెప్పలేం. ధోని రిటైర్మెంట్‌ అనేది అతని తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ధోని గురించి చర్చలకు ముగింపు పలుకుదాం. దిగ్గజాలకు తగిన గౌరవం ఇవ్వాలి’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

కాగా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ధోని పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో ధోని కెరీర్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ధోని ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా లేదా క్రికెటర్‌గా కొనసాగుతాడా అనే అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌లో ధోనినే ప్రధాన చర్చగా మారిపోయాడు.

>
మరిన్ని వార్తలు