కోహ్లి.. నీకు అక్కడ ఫీల్డింగ్‌ అవసరమా?

16 Mar, 2019 12:58 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్‌లో కెప్టెన్‌ అనేవాడు ఎప్పుడూ బౌలర్లు వేసే బంతుల్ని బట్టి ఎప్పటికప్పుడు ఫీల్డింగ్‌ సెట్‌ చేయాల్సి వుంటుందని ఆ విషయాన్ని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి గుర్తిసే బాగుంటుందని మాజీ క్రికెటర్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ సూచించాడు. ఇటీవల కాలంలో కోహ్లి తరచు ‘డీప్‌’లో ఫీల్డింగ్‌ చేస్తూ ఉండటాన్ని వెంగసర్కార్‌ తప్పుబట్టాడు. అసలు ఒక కెప్టెన్‌ అయి ఉండి డీప్‌లో ఫీల్డింగ్‌ ఎలా చేస్తావంటూ ప్రశ్నించాడు.  జట్టు కెప్టెన్‌ ఎప్పుడూ ఇన్నర్‌ సర్కిల్‌లోనే ఫీల్డింగ్ చేస్తే పరిస్థితుల్ని ఫీల్డర్లను సెట్‌ చేసే అవకాశం ఉంటుందని, అలా కాకుండా ఎక్కడో డీప్‌లో ఉంటే ఫీల్డింగ్‌ను పెట్టలేమన్నాడు. అలా ఉంటే అతనికి సరైన సహకారం లభించే అవకాశమే ఉండదన్నాడు. కేవలం చివరి ఓవర్లలో మాత్రమే డీప్‌లో ఫీల్డింగ్‌ చేస్తే తప్పులేదు కానీ,  మ్యాచ్‌ ఆరంభం నుంచి ఆ స్థానంలో కెప్టెన్‌ ఫీల్డింగ్‌ చేస్తూ ఫీల్డర్లను మోహరించడమనేది చాలా కష్టమన్నాడు.

ఇక వరల్డ్‌కప్‌లో కోహ్లి నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడన్న కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యలతో వెంగసర్కార్‌ ఏకీభవించాడు. అది ఒక మంచి నిర్ణయంగానే పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌లో కొన్ని సందర్బాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండవని, అటువంటి తరుణంలో ఆరంభంలోనే వికెట్లను చేజార్చుకుంటే నాల్గో స్థానంలో కోహ్లిని పంపడం లాభిస్తుందన్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన కోహ్లి.. మంచి ఫామ్‌లో ఉండటం కూడా కలిసొస్తుందనన్నాడు. కాకపోతే కోహ్లిపైనే భారత జట్టు మొత్తం ఆధారపడటం ఎంతమాత్రం తగదనే విషయం మేనేజ్‌మెంట్ గుర్తించాలన్నాడు. మిగతా వారి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభిస్తేనే ఇంగ్లండ్‌ పిచ్‌లపై రాణించగలమన్నాడు. వచ్చే వరల్డ్‌కప్‌లో ఎంఎస్‌ ధోని కీలక పాత్ర పోషించడం ఖాయమని వెంగీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు