‘పంత్‌ను తప్పు పట్టలేం’

5 Nov, 2019 03:28 IST|Sakshi

డీఆర్‌ఎస్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్య

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టి20 మ్యాచ్‌లో కీలక సమయంలో భారత్‌ డీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. చహల్‌ వేసిన ఒకే ఓవర్లో రెండు సార్లు ఇలా జరగడం మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపించింది. ఒకసారి ఎల్బీకి అవకాశం ఉన్నా అప్పీల్‌ చేయకపోగా, మరోసారి అనవసరపు అప్పీల్‌తో రివ్యూ కోల్పోయింది. ఇందులో రోహిత్‌ శర్మ తన కీపర్‌ రిషభ్‌ పంత్‌ను నమ్మగా, అతను మాత్రం సరైన విధంగా అంచనా వేయలేకపోయాడు. అయితే ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న పంత్‌ను తప్పు పట్టరాదంటూ రోహిత్‌ సమర్థించాడు. ‘రిషభ్‌ ఇంకా కుర్రాడే. డీఆర్‌ఎస్‌ను అర్థం చేసుకోవడానికి అతనికి కొంత సమయం పడుతుంది. అతని నిర్ణయాలపై అప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. ఇందులో బౌలర్ల పాత్ర కూడా ఉంటుంది. ఫీల్డర్‌ నిలబడిన స్థానంనుంచి ఎల్బీ విషయంలో సరైన విధంగా అంచనా వేయలేం కాబట్టి కీపర్, బౌలర్‌ను ఎవరైనా నమ్మాల్సి ఉంటుంది’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. చివర్లో ఖలీల్‌తో బౌలింగ్‌ చేయించడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లేదని, ఆఖరి ఓవర్లలో తమ స్పిన్నర్లు బౌలింగ్‌ చేయాలని తాను కోరుకోనని రోహిత్‌ స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు