కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో ప్రజ్నేశ్‌ 

1 May, 2018 00:46 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. తాజా సింగిల్స్‌ ర్యాంకుల్లో అతను ఏకంగా 84 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్‌ బెస్ట్‌ 176వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆదివారం చైనాలో జరిగిన ఏటీపీ చాలెంజర్స్‌ టోర్నీలో సింగిల్స్‌ టైటిల్‌ గెలుచుకోవడం ద్వారా 125 పాయింట్లు పొందిన ప్రజ్నేశ్‌ టాప్‌–200 ర్యాంకుల్లో నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో యూకీ బాంబ్రీ రెండు స్థానాలు కోల్పోయి 85వ ర్యాంకుకు పడిపోయినప్పటికీ భారత్‌ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు.  

రామ్‌కుమార్‌ రామనాథన్‌ 120వ, సుమిత్‌ నాగల్‌ 225వ, అర్జున్‌ ఖడే 397వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న ఒక స్థానం కోల్పోయి 23వ ర్యాంకులో, దివిజ్‌ శరణ్‌ రెండు స్థానాలు కోల్పోయి 43వ ర్యాంకులో, లియాండర్‌ పేస్‌ కూడా రెండు స్థానాలు కోల్పోయి 50వ ర్యాంకులో ఉన్నారు. ఆటకు దూరమైన హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా డబ్ల్యూటీఏ డబుల్స్‌ ర్యాంకుల్లో 24వ స్థానానికి పడిపోయింది. ప్రార్థన తొంబరే 164వ ర్యాంకులో ఉంది.   

మరిన్ని వార్తలు