మూడు సెక్షన్‌ల కింద కేసు నమోదు... 

13 Oct, 2018 01:09 IST|Sakshi

మైదానంలోకి దూసుకెళ్లి కోహ్లితో సెల్ఫీ దిగి హల్‌చల్‌ చేసిన యువకుడిని కడప జిల్లా వాసి మొహమ్మద్‌ ఖాన్‌గా గుర్తించారు. అతనిపై సెక్షన్‌–341, 448, 506ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కోహ్లికి వీరాభిమాని అయిన 19 ఏళ్ల మొహమ్మద్‌ ఖాన్‌ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడని... అతని తండ్రి మొహమ్మద్‌ జమీల్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. టెస్టు మ్యాచ్‌ చూసేందుకు గురువారం కడప నుంచి రైలులో బయలుదేరిన ఖాన్‌ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగాడని... అక్కడి నుంచి మ్యాచ్‌ టికెట్లు విక్రయిస్తున్న జింఖానా మైదానానికి చేరుకొని అక్కడ రూ. 100 టికెట్‌ కొనుగోలు చేసి ఉప్పల్‌ స్టేడియానికి వచ్చాడని ఆయన తెలిపారు.  

నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు... 
ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో విధులు నిర్వహిస్తూ నిర్లక్ష్యం వహించిన పోలీస్‌ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలు జారీ చేశారు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కోహ్లి వీరాభిమాని గ్రౌండ్‌లోకి దూసుకెళ్లడాన్ని సీపీ తీవ్రంగా పరిగణించారు. కోహ్లి వీరాభిమాని మహ్మద్‌ ఖాన్‌ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తున్న నేరెడ్‌మెట్‌ ఎస్‌ఐ ప్రభాకర్, జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ శ్రీను, కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు నారాయణలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

>
మరిన్ని వార్తలు