క్రికెటర్లకూ తప్పని కరెన్సీ కష్టాలు

14 Nov, 2016 19:07 IST|Sakshi
క్రికెటర్లకూ తప్పని కరెన్సీ కష్టాలు

కోల్‌కతా: పెద్ద నోట్లను రద్దు చేశాక కరెన్సీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఖాతాలో డబ్బున్నా అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడుతుంటే, విక్రయాలు తగ్గి వ్యాపారాలు విలవిలలాడుతున్నారు. కోల్‌కతాలో విదర్భ, మహారాష్ట్రల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌పైనా కరెన్సీ ఎఫెక్ట్‌ పడింది. విదర్భ రంజీ జట్టు క్రికెటర్లు డబ్బుల్లేక ఇబ్బందిపడుతున్నారు. విదర్భ క్రికెట్‌ జట్టు దగ్గర నగదు లేదని, ఆ జట్టు మేనేజర్‌ కిశోర్‌ వకొడె డబ్బుల్లేకుండానే నడిపిస్తున్నాడని సమాచారం. విదర్భ జట్టు నగదు కోసం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) సాయం కోరనుంది.

సోమవారం గురునానక్‌ జయంతి సందర్భంగా బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో క్రికెటర్లు, ఇతర సిబ్బంది కరెన్సీ లేక ఇబ్బందిపడ్డారు. సాయం చేయాల్సిందిగా విదర్భ రంజీ జట్టు మేనేజ్‌మెంట్‌ కోరలేదని, వారు సంప్రదిస్తే కచ్చితంగా సాయం చేస్తామని క్యాబ్‌ సంయుక్త కార్యదర్శి అభిషేక్‌ దాల్మియా చెప్పారు. రంజీ ఆటగాళ్లకు రోజువారి అలవెన్స్‌ కింద 1500 రూపాయలు ఇస్తామని, మ్యాచ్‌ లేని రోజుల్లో వసతి, భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు