కోలుకున్న సెంట్రల్ జోన్

1 Nov, 2014 00:46 IST|Sakshi
కోలుకున్న సెంట్రల్ జోన్

న్యూఢిల్లీ: దులీప్ ట్రోఫీ ఫైనల్ రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన చూపినా... కీలక రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా రాణిస్తున్న సెంట్రల్ జోన్ ప్రస్తుతం 111 పరుగుల ఆధిక్యం సాధించింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ 62 ఓవర్లలో నాలుగు వికెట్లకు 214 పరుగులు చేసింది. ఇంకా ఆటకు రెండు రోజుల సమయం ఉండగా చేతిలో ఆరు వికెట్లున్నాయి. పిచ్‌పై పగుళ్లు ఏర్పడడంతో సెంట్రల్ 250 పరుగుల వరకు ఆధిక్యం సాధిస్తే చివరి రోజు సౌత్ జోన్‌ను ఇబ్బంది పెట్టవచ్చు.

ఓపెనర్లు ఫయాజ్ ఫజల్ (139 బంతుల్లో 72; 11 ఫోర్లు), జలజ్ సక్సేనా (119 బంతుల్లో 71; 15 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రెచ్చిపోవడంతో తొలి వికెట్‌కు 128 పరుగులు వచ్చాయి. స్పిన్నర్ ఓజా వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. అయితే మిడిలార్డర్ పెద్దగా రాణించలేకపోయింది. క్రీజులో రాబిన్ బిస్త్ (67 బంతుల్లో 26 బ్యాటింగ్; 2 ఫోర్లు; 1 సిక్స్), మహేశ్ రావత్ (9 బంతుల్లో 11 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. శ్రేయాస్ గోపాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90.3 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటయింది. విహారి (97 బంతుల్లో 75; 10 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు. అలీ ముర్తజాకు నాలుగు వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు