సెంట్రల్ జోన్ 123/5 :దులీప్ ట్రోఫీ

11 Oct, 2013 03:19 IST|Sakshi

 చెన్నై: సౌత్ జోన్ పేసర్ అభిమన్యు మిథున్ (3/24) పదునైన బంతులతో రెచ్చిపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సెంట్రల్ జోన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసమయానికి సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 123 పరుగులు చేసింది. వర్షం కారణంగా పూర్తి స్థాయి ఓవర్లు ఆడేందుకు వీలు పడలేదు. మూడో ఓవర్ నుంచే మిథున్ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. దీంతో 13 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన సెంట్రల్‌ను ఓపెనర్ ముకుల్ దాగర్ (105 బంతుల్లో 45; 6 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకున్నాడు. బిస్త్ (18)తో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. తనను కూడా మిథున్ పెవిలియన్‌కు చేర్చడంతో సెంట్రల్ కష్టాల్లో పడింది.
 
 నార్త్ జోన్ 33/0
 కొచ్చి: మరో సెమీఫైనల్‌కు వర్షం అడ్డంకిగా నిలి చింది. దీంతో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ 4 రోజుల మ్యాచ్‌లో కేవలం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్త్ జోన్ నిదానంగా ఆడడంతో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేయగలిగింది. క్రీజులో జీవన్‌జ్యోత్ (18), ఉన్ముక్త్ చంద్ (12) ఉన్నారు.
 

మరిన్ని వార్తలు