'అవసరమైతే పారామిలటరీ బలగాలు'

4 Mar, 2016 19:14 IST|Sakshi

న్యూఢిల్లీ:వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన ధర్మశాలలో జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్పై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి హిమచల్ రాష్ట్ర ప్రభుత్వం తమను భద్రతను కోరిన పక్షంలో పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ మ్యాచ్ నిర్వహణపై తాము భద్రత కల్పించాలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం వివరణ ఇచ్చారు. తమ సాయాన్ని కోరితే కచ్చితంగా పారామిలటరీ ఫోర్స్ను పంపుతామని పేర్కొన్నారు. ఇది కేవలం వీరభద్రసింగ్ నిర్ణయాన్ని బట్టే ఆధారపడి ఉంటుందని రాజ్ నాథ్ తెలిపారు.


మరోవైపు పాకిస్తాన్ మిలిటెంట్ మసూద్ అజహర్ తలను భారత్కు అప్పగించాలంటూ మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,  కాంగ్రెస్ మాజీ మంత్రి మేజర్ విజయ్ సింగ్ మంకోతియా నిరసన గళం వినిపించడంతో ఆ మ్యాచ్ నిర్వహణ మరింత సందిగ్థంలో పడింది. కాగా, పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ)బెదిరింపులకు దిగింది. ఐసీసీ టీ-20 వరల్డ్‌ కప్‌లో తమ జట్టుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతోపాటు, ఈ టోర్నీలో పాక్‌ ఆడనుందని భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, లేదంటే తాము మెగాటోర్నీ నుంచి తప్పుకొంటామంటోంది.

>
మరిన్ని వార్తలు