ఆ సెంచరీ నాకు చాలా స్పెషల్: కోహ్లి

8 Jul, 2017 14:43 IST|Sakshi
ఆ సెంచరీ నాకు చాలా స్పెషల్: కోహ్లి

న్యూఢిల్లీ: ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలోటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అజేయ శతకం(111 నాటౌట్: 115బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు.  తద్వారా విండీస్‌పై వన్డే సిరీస్‌ను 3-1తో భారత్ కైవసం చేసుకుంది. ఈ వన్డేలో సాధించిన సెంచరీతో కోహ్లి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లికిది 28వ శతకం కాగా, ఛేజింగ్‌లో 18వ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకూ ఛేజింగ్‌లో  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(17) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లి అధిగమించాడు.

అయితే ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా తొలి మ్యాచ్లో సాధించిన సెంచరీ తనకు చాలా చాలా స్పెషల్ అని కోహ్లి పేర్కొన్నాడు.  ఆ మ్యాచ్ లో కేదర్ జాదవ్ తో రెండొందల పరుగుల భాగస్వామ్యాన్ని సాధించే క్రమంలో చేసిన  సెంచరీనే తనకు అత్యుత్తమన్నాడు. ప్రధానంగా భారత్ జట్టు 63 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో తాను నమోదు చేసిన 122 పరుగులకు తనకు ఎప్పటికీ ప్రత్యేకమన్నాడు. ఇంగ్లండ్ విసిరిన 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహకరించిన తన శతకం కచ్చితంగా స్పెషల్ ఇన్నింగ్స్ అని విరాట్ పేర్కొన్నాడు.

అయితే తాను సాధించిన సెంచరీలకు రేటింగ్ ఇవ్వడం కష్టసాధ్యమైనప్పటికీ, పరిస్థితుల్ని బట్టి జట్టును విజయ తీరాలకు చేర్చిన ఏ ఇన్నింగ్స్ అయినా గొప్పదేనని కోహ్లి తెలిపాడు. ఈ మేరకు ఆసియా కప్లో భాగంగా బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో చేసిన 49 పరుగులు కూడా మంచి స్కోరు కిందకే వస్తుందన్నాడు.

 

మరిన్ని వార్తలు