ఆర్సీబీకి ఇంకా ఛాన్స్‌ ఉంది!

16 Apr, 2019 11:40 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌లో తమ జట్టుకు ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) లెగ్‌-స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ అభిప్రాయపడ్డాడు. తమకు ప్లేఆఫ్‌ అవకాశం లేదన్న వాదనతో విభేదించాడు. ముంబై ఇండియన్స్‌తో వాంఖడే మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ముందుకెళ్లే దారులు దాదాపు మూసుకుపోయాయి.

ఆర్సీబీ ఇప్పటివరకు 8 లీగ్‌ మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ‘తర్వాతి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశముంది. గతేడాది 14 పాయింట్లతో ఒక జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లింది. కాబట్టి మాకు ఇంకా అవకాశముంది. తర్వాతి మ్యాచ్‌ల్లో ఏం జరుగుతుందో మనకు తెలియద’ని చాహల్‌ వ్యాఖ్యానించాడు. గత 11 సీజన్లలో నాలుగు సార్లు మాత్రమే 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. గతేడాది రాజస్థాన్‌ రాయల్స్‌ 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు వచ్చింది.

కాగా, హార్దిక్‌ పాండ్యా కారణంగానే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ చేజార్చుకోవాల్సి వచ్చిందన్నాడు. పిచ్‌ స్పిన్నర్లకు సహకరించిందని, 18వ ఓవర్‌ వరకు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశామన్నాడు. అయితే 19వ ఓవర్‌లో హార్దిక్‌ చెలరేగి 22 పరుగులు బాదడంతో ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. (చదవండి: బెంగళూరు కథ కంచికే! )

మరిన్ని వార్తలు