ఐపీఎల్‌ వరకూ కష్టమే..!

24 Dec, 2019 11:29 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఇటీవల వెస్టిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో  వెన్నుగాయంతో సతమతమైన టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఆ తర్వాత  మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే ఆ గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యాలు వెన్నుగాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దీపక్‌ చాహర్‌కు కూడా అదే గాయం బారిన పడగా కొన్ని నెలల పాటు విశ్రాంతి తప్పకపోవచ్చు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) రాబోవు సీజన్‌  ఆరంభం నాటి వరకూ చాహర్‌ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనబడుటం లేదు.

శ్రీలంక, ఆసీస్‌ జట్లతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత జట్టును  ఎంపిక చేసిన క్రమంలో సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. దీపక్‌ చాహర్‌ ఏప్రిల్‌ వరకూ అందుబాటులోకి రావడం కష్టమనే అనుమానం వ్యక్తం చేశాడు. ‘ ఏప్రిల్‌ వరకూ దీపక్‌ చాహర్‌ జట్టుకు అందుబాటులోకి రాకపోవచ్చు. అతను వెన్నుగాయంతో సతమతమవుతున్నాడు. నాకు తెలిసినంత  వరకూ చాహర్‌కు సుదీర్ఘ  విశ్రాంతి అవసరం కావొచ్చు.’ అని అన్నాడు. కాగా, జట్టుకు కొంతమంది దూరమైనప్పటికీ తమకు అన్ని ఫార్మాట్ల​కు తగినంత బ్యాకప్స్‌ ఉన్నాయన్నాడు.

గత ఆరేడేళ్ల కాలం నుంచి చూస్తే భారత్‌ జట్టుకు అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉందన్నాడు. దాంతో మ్యాచ్‌లకు సిద్ధమయ్యే క్రమంలో ఫలానా ఆటగాడు లేడని చింతించాల్సిన అవసరం లేదన్నాడు. ‘ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముగ్గురు ఓపెనర్లు కూడా అందుబాటులో ఉంటారు. చాహర్‌కు అనూహ్యంగా వెన్ను నొప్పి వచ్చింది. అయితే మనకు తగినంత సంఖ్యలో రిజర్వ్‌ పేస్‌ బౌలర్లు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్‌ పాండ్యాను న్యూజి లాండ్‌లో పర్యటించే భారత ‘ఎ’ జట్టులోకి ఎంపిక చేశాం’ అని ఎంఎస్‌కే అన్నాడు. 

మరిన్ని వార్తలు