బింద్రాకు అరుదైన గౌరవం

31 Oct, 2014 01:02 IST|Sakshi
బింద్రాకు అరుదైన గౌరవం

ఐఎస్‌ఎస్‌ఎఫ్ అథ్లెట్స్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక
 
న్యూఢిల్లీ: దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు  అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) చైర్మన్‌గా ఎంపికైన తొలి భారతీయుడిగా బింద్రా రికార్డు సృష్టించాడు. ఈ మేరకు భారత జాతీయ రైఫిల్ సంఘాని (ఎన్‌ఆర్‌ఏఐ)కి ఐఎస్‌ఎస్‌ఎఫ్ నుంచి లేఖ అందింది. విశ్వవ్యాప్తంగా షూటింగ్ కార్యకలాపాలన్నీ ఈ సమాఖ్య నుంచే జరుగుతాయి. 32 ఏళ్ల బింద్రా ఈ పదవి దక్కించుకోవడంతో ఐఎస్‌ఎస్‌ఎఫ్ పరిపాలనా మండలిలో కూడా సభ్యుడవుతాడు. ‘ఇది నిజంగా చాలా గొప్ప గౌర వం. వ్యక్తిగతంగానే కాకుండా దేశానికే దక్కిన పురస్కారంగా భావిస్తున్నాను.

ఈ పదవి చాలా బాధ్యతాయుతమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షూటర్ల సమస్యలకు సంబంధించి నేను బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందరినీ సమదృష్టితో చూస్తూ పదవికి న్యాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని బింద్రా అన్నాడు. ఇప్పటిదాకా అతను ఐఎస్‌ఎస్‌ఎఫ్ అథ్లెట్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. బింద్రాకు దక్కిన గుర్తింపుపై ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
 
 

మరిన్ని వార్తలు