చాంపియన్... షాంపేన్

5 Apr, 2016 03:29 IST|Sakshi
చాంపియన్... షాంపేన్

మిన్నంటిన వెస్టిండీస్ క్రికెటర్ల సంబరాలు

విజయాన్ని ఎలా వేడుకగా జరుపుకోవాలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అదే ప్రపంచకప్ గెలిస్తే ఇక వారి సంబరాలకు పట్టపగ్గాలు ఉండవు. 2012లో గంగ్నమ్ డ్యాన్స్‌తో విండీస్ హోరెత్తిస్తే ఈ సారి చాంపియన్ పాట వారితో నాట్యమాడించింది. మైదానంలో గెలుపు తర్వాత మొదలైన సంబరాలు సోమవారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కొనసాగాయి.

 స్టేడియంలో ఫైనల్ ముగిసిన తర్వాతే విండీస్ క్రికెటర్లు పట్టరాని ఆనందంతో చిందులు వేశారు. అక్కడ అలసిపోయేంత వరకు ఆడిపాడిన బృందం హోటల్‌కు చేరగానే మళ్లీ కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంది. ఎంట్రన్స్‌నుంచే చాంపియన్ డ్యాన్స్ చేసుకుంటూ వారు లోపలికి వచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరిన అభిమానులు కూడా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహపరచడంతో స్యామీ, బ్రేవో చెలరేగిపోయారు. మధ్యలో సెల్ఫీల కోసం సంబరపడిన ఎవరినీ వారు నిరాశ పర్చలేదు.


 స్పెషల్ నైట్
వేడుకలకు విరామం ఇవ్వకుండా హోటళ్లో మళ్లీ అంతా ఒక్కచోటికి చేరారు. అక్కడ షాంపేన్ వరదలా పారింది. అప్పటికే హోటల్ ప్రతినిధులు సిద్ధం చేసిన కేక్‌ను కట్ చేయడంతో మరో రౌండ్ సంబరాలు మొదలయ్యాయి. చాంపియన్ పాటతో జోష్ మొదలైనా... తర్వాత హాలీవుడ్ సంగీతం అక్కడ హోరెత్తింది. ప్రపంచ విజేతలు ఈ ప్రపంచాన్ని మరచిపోయి డ్యాన్స్‌తో చెలరేగిపోయారు. మధ్యలో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ కూడా వారితో జత కలవడం ఆటగాళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచింది. అభినందించేందుకు రూమ్‌కు వచ్చిన లాయిడ్ కూడా చాంపియన్ డ్యాన్స్ చేయడం విశేషం.

విండీస్ ఫైనల్‌ను టీవీలో వీక్షించిన అనంతరం ఇదే డ్యాన్స్ చేసి జట్టుకు అభినందనలు పలికిన విఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆ వీడియోను జట్టు సభ్యులకు పంపించగా... వారంతా ఆసక్తిగా తిలకించారు. సోమవారం మధ్యాహ్నం విక్టోరియా ప్యాలెస్ వద్ద ఫోటో సెషన్‌కు స్యామీ, బ్రాత్‌వైట్ హాజరు కాగా, సాయంత్రంనుంచి ఆటగాళ్లు బయల్దేరి వెళ్లారు. వీరిలో కొందరు నేరుగా తమ ఐపీఎల్ జట్లతో చేరగా, ఇతర ఆటగాళ్లు విండీస్ పయనమయ్యారు.

► కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ భవనం ముందు ప్రపంచకప్ ట్రోఫీలతో వెస్టిండీస్ మహిళల కెప్టెన్ స్టెఫానీ  టేలర్, పురుషుల జట్టు కెప్టెన్ స్యామీ
 
 
 చూస్తున్నవాళ్లం అలసిపోయాం

 
మామూలుగానే విండీస్ క్రికెటర్లు చిన్న చిన్న సంతోషాలను కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ విజయం తర్వాత చెప్పేదేముంది. చూస్తున్నవాళ్లం అలసిపోయాం కానీ వారు మాత్రం ఆట, పాటతో అలసిపోలేదు. ప్రాక్టీస్ సమయంలో, ఆడే సమయంలో కూడా వాళ్లు తీవ్రంగా శ్రమిస్తారు. వంద శాతం కష్టపడతారు. అదే మైదానం దాటితే సంబరాలు కూడా అదే తరహాలో రెట్టింపు స్థాయిలో ఉంటాయి. హోటల్‌లోని టీమ్ రూమ్‌లో అడుగు పెట్టిన తర్వాత వారో కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో గేల్ అయినా, మరే జూనియర్ ఆటగాడైనా ఒక్కటే. ఇలాంటి గొప్ప జట్టుతో టోర్నీకి పని చేయడం నా అదృష్టం
 - విక్రమ్ మాన్‌సింగ్, వెస్టిండీస్ టీమ్ లైజన్ మేనేజర్

మరిన్ని వార్తలు