చాంపియన్ ఈస్ట్‌ జోన్

19 Feb, 2017 01:39 IST|Sakshi
చాంపియన్ ఈస్ట్‌ జోన్

ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ  
ముంబై: తొలిసారి ఇంటర్‌ జోనల్‌ ఫార్మాట్‌లో జరిగిన  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఈస్ట్‌ జోన్ జట్టు చాంపియన్ గా అవతరించింది. ఐదు జోన్ ల (సౌత్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, నార్త్‌) మధ్య రౌండ్‌ రాబిన్  లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఈస్ట్‌ జోన్ ఆడిన నాలుగు మ్యాచ్‌లో్లనూ గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో మనోజ్‌ తివారీ సారథ్యంలోని ఈస్ట్‌ జోన్  జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో వెస్ట్‌ జోన్  జట్టును ఓడించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌ జోన్  20 ఓవర్లలో ఐదు వికెట్లకు 149 పరుగులు చేసింది. షెల్డన్  జాక్సన్  (44 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 150 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్‌ జోన్  13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి అధిగమించింది. విరాట్‌ సింగ్‌ (34 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాంక్‌ జగ్గీ (30 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు సాధించి ఈస్ట్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఓటమితో ముగించిన సౌత్‌ జోన్
మరోవైపు సెంట్రల్‌ జోన్ తో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ జోన్  రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ టోర్నీలో సౌత్‌ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచి, మిగతా మూడింటిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 181 పరుగులు చేయగా... సెంట్రల్‌ జోన్  జట్టు సరిగ్గా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 184 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. చివరి ఓవర్‌లో సెంట్రల్‌ జట్టు విజయానికి నాలుగు పరుగులు అవసరమయా్యయి. సెంట్రల్‌ జట్టు టాప్‌ స్కోరర్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ (51 బంతుల్లో 92; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివరి ఓవర్‌ తొలి బంతికి అవుటైనా... అమిత్‌ మిశ్రా (5 బంతుల్లో 13 నాటౌట్‌), అంకిత్‌ రాజ్‌పుత్‌ (4 బంతుల్లో 5 నాటౌట్‌) ఒత్తిడికి లోనుకాకుండా సెంట్రల్‌ జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు.

>
మరిన్ని వార్తలు