చాంపియన్స్ లీగ్ టి20 రద్దు

16 Jul, 2015 01:35 IST|Sakshi
చాంపియన్స్ లీగ్ టి20 రద్దు

♦  గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం
♦  8 జట్లతోనే ఐపీఎల్!
 
 న్యూఢిల్లీ : చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేధం విధించి ఒక్క రోజు కూడా గడవకముందే క్రికెట్‌లో మరో పరిణామం చోటు చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్న చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేస్తూ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం నిర్ణయం తీసుకుంది.  ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. మూడు దేశాలు ఏకగ్రీవంగా దీనికి ఆమోద ముద్ర వేశాయి. టోర్నీకి సరైన ప్రజాదరణ లేదని గతంలోనే రద్దు ప్రతిపాదనలు వచ్చినా... స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్తాన్, చెన్నై ఫ్రాంచైజీలపై వేటు పడటంతో ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టింది. ప్రజాదరణ దృష్ట్యా తాము తీసుకున్న నిర్ణయం సరైందేనని కౌన్సిల్ తెలిపింది. సీఎల్‌టి20ని బీసీసీఐ, సీఏ, సీఎస్‌ఏలు కలిసి 2009లో ఏర్పాటు చేశాయి.
 
 ఎనిమిది జట్లతోనే ఐపీఎల్!
 చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై నిషేధంతో షాక్‌కు గురైన బీసీసీసీఐ మళ్లీ ఎనిమిది జట్లతోనే ఐపీఎల్‌ను నిర్వహించే దిశగా కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు బోర్డు ఉన్నతాధికారులు దీనిపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అనధికారికంగా చర్చలు కూడా ప్రారంభించారని సమాచారం. ఆదివారం ముంబైలో జరిగే ఐపీఎల్ పాలకమండలి అత్యవసర సమావేశం నాటికి దీనిపై తుది నిర్ణయానికి రావాలని భావిస్తున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తు తం బీసీసీఐ రెండు రకాల ఆలోచనలు చేస్తోందన్నారు. ‘మొదటి అవకాశంగా... నిషేధానికి గురైన రెండు ఫ్రాంచైజీల జట్లను బోర్డు ఆధ్వర్యంలో కొనసాగించాలని అనుకుంటున్నాం. నిషేధం ముగిశాక పాత యజమానులు వాటి బాధ్యతలు తీసుకుం టారు. ఇక రెండో అవకాశం... కొత్త ఫ్రాంచైజీలకు బిడ్‌లను పిలవడం’ అని ఆ అధికారి పేర్కొన్నారు.  
 
 నాకు అన్యాయం చేశారు: కుంద్రా
 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో లోధా కమిటీ తనకు తీవ్ర అన్యాయం చేసిందని రాజస్తాన్ ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్ కుంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు చాలా నిరాశ కలిగించిన రోజు. నా నిజాయితీకి సవాలు ఎదురైంది. విచారణలో నేను ఇచ్చిన మద్దతే నాకు వ్యతిరేకంగా పని చేసింది. సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ నా కేసు విషయంలో ఇప్పుడు దాన్ని శంకించాల్సి వస్తోంది. నాకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. వాటిని చూసైనా శిక్ష విషయంలో కాస్త సంతృప్తి పడతా’ అని కుంద్రా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు