సిక్కి మరిన్ని విజయాలు సాధిస్తుంది

25 May, 2018 01:54 IST|Sakshi
సిక్కి రెడ్డికి కారు తాళాలు అందజేస్తున్న నాగార్జున. చిత్రంలో గోపీచంద్, చాముండేశ్వరీనాథ్, సింధు 

జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ విశ్వాసం

ప్రదర్శనకు గుర్తింపుగా కారు బహూకరించిన చాముండేశ్వరీనాథ్‌ 

నాగార్జున చేతుల మీదుగా అందుకున్న సిక్కి రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: గతంతో పోలిస్తే ఇప్పుడు డబుల్స్‌వైపు మొగ్గు చూపేందుకు ఆటగాళ్లు మరింత ఆసక్తి కనబరుస్తున్నారని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్‌ డబుల్స్‌ క్రీడాకారిణి సిక్కి రెడ్డికి ప్రోత్సాహకంగా ఇటీవలే తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ ఫోర్డ్‌ ఎకో స్పోర్ట్‌ కారును నజరానాగా ఇస్తామని ప్రకటించారు. ఆయన తన హామీ నిలబెట్టుకుంటూ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో గురువారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కారు తాళాలను సిక్కి రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ ‘కొన్నాళ్లుగా సిక్కి రెడ్డి అద్భుతంగా ఆడుతోంది.

కోచ్‌గా ఆమె ఆటతీరుపట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పటివరకు ఆమె సాధించిన విజయాలు ఆరంభం మాత్రమే. కారు నజరానాలాంటి ప్రోత్సాహంతో భవిష్యత్‌లో ఆమె నుంచి మరిన్ని విజయాలు వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నాను’ అని అన్నారు. గత నెలలో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో సిక్కి రెడ్డి టీమ్‌ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది.  ‘క్రీడాకారులకు చాముండేశ్వరీనాథ్‌ అందిస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయం. పీబీఎల్‌లో సిక్కి రెడ్డి మ్యాచ్‌లు చూశాను. ఆమె ఆటతీరు అద్భుతం. ప్రపంచ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–3లో ఉన్న సింధుకు అభినందనలు. ఇక గోపీచంద్‌ అకాడమీ చాంపియన్స్‌కు అడ్డాగా మారిపోయింది’ అని నాగార్జున వ్యాఖ్యానించారు.  

స్వర్ణం సాధిస్తే మరో కారు... 
‘మూడేళ్లుగా సిక్కి సాధించిన విజయాలు అసాధారణం. భవిష్యత్‌లో సిక్కి గనుక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ లేదా ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిస్తే ఆమెకు మరో కారును బహుమతిగా అందజేస్తాను’ అని చాముండేశ్వరీనాథ్‌ తెలిపారు.  ‘నా విజయాలకు గుర్తింపుగా కారు అందజేసినందుకు చాముండీ అంకుల్‌కు ధన్యవాదాలు. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు కోచ్‌ గోపీచంద్‌ సర్‌కు, నా తోటి క్రీడాకారిణి పీవీ సింధుకు కృతజ్ఞతలు’ అని సిక్కి తెలిపింది.

మరిన్ని వార్తలు