కరుణ్‌ నాయర్‌కు చాన్స్‌!

5 Jan, 2017 23:55 IST|Sakshi
కరుణ్‌ నాయర్‌కు చాన్స్‌!

ధావన్‌ తిరిగి వచ్చే అవకాశం
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు నేడు వన్డే, టి20 జట్ల ప్రకటన


ముంబై: మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీనుంచి తప్పుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విరాట్‌ కోహ్లి భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం లాంఛనంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌ కోసం జట్టును ప్రకటించనున్న సెలక్టర్లు కెప్టెన్‌గా కోహ్లి పేరును ప్రకటిస్తారు. జట్టు ఎంపిక సమయంలో కోహ్లి కూడా సమావేశానికి  హాజరయ్యే అవకాశం ఉంది. ఆటగాడిగా ధోని తన స్థానం నిలబెట్టుకోవడంపై కూడా ఎలాంటి సందేహాలు లేవు. భారత్, ఇంగ్లండ్‌ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 15న తొలి వన్డే కాగా, ఫిబ్రవరి 1న చివరి టి20తో సిరీస్‌ ముగుస్తుంది.

అశ్విన్‌కు విశ్రాంతి!
భారత జట్టు న్యూజిలాండ్‌తో ఆడిన వన్డే సిరీస్‌కు అశ్విన్, షమీ, జడేజా దూరంగా ఉన్నారు. వీరిలో షమీ ప్రస్తుతం గాయంనుంచి కోలుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో కీలకమైన టెస్టుల సిరీస్‌ కోసం అశ్విన్‌కు మళ్లీ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అయితే టెస్టుల తర్వాత తగినంత విశ్రాంతి లభించడంతో జడేజా మాత్రం తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడిని తీసుకోకపోతే రంజీ సీజన్‌లో అత్యధిక వికెట్లతో (56) సత్తా చాటిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ పేరు కూడా ఎంపిక కోసం వినిపిస్తోంది. వైజాగ్‌లో జరిగిన తన ఆఖరి వన్డేలో చెలరేగిన మిశ్రాకు చోటు ఖాయం. పేస్‌ బౌలింగ్‌పరంగా కూడా కొత్త ప్రయోగాలకు ఆస్కారం ఏమీ లేదు. బుమ్రా, ఉమేశ్‌లు జట్టులో స్థానం నిలబెట్టుకుంటారు. అయితే షమీ, ధావల్‌ కూడా గాయాలబారిన పడటంతో ఇషాంత్‌కు మళ్లీ వన్డేలు ఆడే అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్‌లో ఇంకా రోహిత్‌ శర్మ, రహానే కోలుకోలేదు.

కాబట్టి చెన్నై టెస్టులో ట్రిపుల్‌తో దుమ్ము రేపిన కరుణ్‌ నాయర్‌ వన్డే జట్టులోకీ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో అతను జింబాబ్వేతో మ్యాచ్‌ ఆడాడు. కివీస్‌తో సిరీస్‌ ఆడని కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం చేస్తాడు. జయంత్‌ యాదవ్‌ కూడా తన స్థానం నిలబెట్టుకోనున్నాడు. మరో వైపు రెండో ఓపెనర్‌గా పూర్తి ఫిట్‌గా ఉంటే శిఖర్‌ ధావన్‌ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. రైనా పేరును కేవలం టి20ల కోసం పరిశీలించవచ్చని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మన జట్టు ఇటీవల చెలరేగుతున్న తీరు చూస్తే ఇరు జట్ల ఎంపికలో కూడా పెద్దగా సంచలనాలు ఏమీ ఉండకపోవచ్చు.

మరిన్ని వార్తలు