క్రికెట్ కు చందర్పాల్ వీడ్కోలు

23 Jan, 2016 11:44 IST|Sakshi
క్రికెట్ కు చందర్పాల్ వీడ్కోలు

పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు శివనారాయణ్  చందర్పాల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 22 సంవత్సరాల పాటు వెస్టిండీస్ క్రికెట్ కు సుదీర్ఘ సేవలందించిన చందర్పాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించాడు. అన్ని ఫార్మెట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చందర్ పాల్ స్పష్టం చేశాడు.

తన కెరీర్ లో 164 టెస్టు మ్యాచ్లు ఆడిన చందర్పాల్  30 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీల సాయంతో 11, 867 పరుగులు చేసి విండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో టెస్టు క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. అతని కంటే ముందు బ్రియాన్ లారా(11,953) ఉన్నాడు. కాగా, చందర్పాల్ 268 వన్డేలు ఆడి 11 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీల సాయంతో 8,778  పరుగులు సాధించాడు.  గతేడాది జూన్ లో తన వీడ్కోలకు సమయం ఆసన్నమైందంటూ సూచనప్రాయంగా తెలిపిన చందర్పాల్.. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది ఆరంభంలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2011 మేనెలలో పాకిస్తాన్ తో చివరి వన్డే ఆడిన చందర్ పాల్..2015 మే నెలలో ఇంగ్లండ్ తో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు.


ఇదిలా ఉండగా 2015-16  సీజన్కు  సంబంధించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితా ను ఇటీవల ప్రకటించిన విండీస్ బోర్డు... సీనియర్ ఆటగాడు చందర్పాల్ కు అవకాశం కల్పించకపోవడం కూడా అతని రిటైర్మెంట్ నిర్ణయానికి ఒక కారణం. విండీస్ బోర్డు విడుదల చేసిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో చందర్ పాల్ తో పాటు  డారెన్ సామీ, ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో, ఆండ్రూ రస్సెల్, క్రిస్ గేల్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు