భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ‘రికార్డు’ స్కోరు

13 Feb, 2020 19:37 IST|Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ చరిత్రలో మరో రికార్డు నమోదైంది.  అత్యధిక తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌లో చండీగఢ్‌ నయా అధ్యాయాన్ని లిఖించింది. రంజీ ట్రోఫీలో రౌండ్‌-9 ప్లేట్‌ గ్రూప్‌లో భాగంగా మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్‌కు 609 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. మణిపూర్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 26. 4 ఓవర్లలో63 పరుగులకే కుప్పకూలగా, ఆపై చండీగఢ్‌ 672/8 వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది.  బిపుల్‌ శర్మ(200; 276 బంతుల్లో 27 ఫోర్లు, 4 సిక్స్‌లు), గురిందర్‌ సింగ్‌( 200 నాటౌట్‌; 171 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి చండీగఢ్‌ భారీ స్కోరులో పాలుపంచుకున్నారు. వీరికి జతగా కీపర్‌ ఉదయ్‌ కౌల్‌(148) భారీ సెంచరీ సాధించడంతో చండీగఢ్‌ ఆరొందలకు పైగా స్కోరును నమోదు చేసింది. ఫలితంగా భారత క్రికెట్‌ చరిత్రలో నాల్గో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని చండీగఢ్‌ లిఖించింది.

ఫిబ్రవరి 12వ తేదీన(బుధవారం) మ్యాచ్‌ ఆరంభం కాగా, రెండో రోజు ఆటకే మణిపూర్‌ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించడం గమనార్హం. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్‌ జట్టు  వికెట్‌ కోల్పోకుండా 33 పరుగులు చేసింది. కాగా, మణిపూర్‌ జట్టును నిన్న తొలి సెషన్‌లోనే ఆలౌట్‌ చేసి, దాదాపు రెండు రోజులు పాటు ఆడిన చండీగఢ్‌ అరుదైన రికార్డును నమెదు చేసింది. ఇప్పటివరకూ భారత క్రికెట్‌ ఫస్ట్‌క్లాస్‌ హిస్టరీలో తాజా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కంటే మూడు మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి. 

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక ఆధిక్యం సాధించిన జట్లలో  హెల్కర్‌ జట్టు 722 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ను సాధించి తొలి స్థానంలో కొనసాగుతోంది. 1945-46 సీజన్‌లో హోల్కర్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో912 పరుగులకు డిక్లేర్‌ చేయగా, మైసూర్‌ 190 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత 1993-94 సీజన్‌లో హైదరాబాద్‌ 681 పరుగుల ఆధిక్యాన్ని సాధించి రెండో స్థానంలో ఉంది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 944/6 వద్ద డిక్లేర్డ్‌ చేయగా, ఆంధ్ర తమ మొదటి ఇన్నింగ్స్‌లో  263 పరుగులకు ఆలౌటైంది.ఇక 2014-15 సీజన్‌లో కర్ణాటక 628 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. తమిళనాడు జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 762 పరుగులు చేయగా, తమిళనాడును 134 పరుగులకు ఆలౌట్‌ చేసింది. 

మరిన్ని వార్తలు