లంక కెప్టెన్‌ ఫేక్‌ ఫీల్డింగ్‌.. కోహ్లిని పట్టించుకోని అంపైర్లు

20 Nov, 2017 03:30 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : వివాదాస్పద ఫేక్‌ ఫీల్డింగ్ వ్యవహారం శ్రీలంక-భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌లోనూ ఎదురయ్యింది. మూడో రోజైన శనివారం భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా శ్రీలంక కెప్టెన్ చండిమల్‌ ఈ మోసానికి పాల్పడ్డాడు.
 
భారత ఇన్నింగ్స్‌ 53వ ఓవర్‌ను దసున్‌ క్షనక బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని భువనేశ్వర్‌ కవర్స్‌ వైపు ఆడాడు. బంతికోసం పరిగెత్తిన చండి డైవ్‌ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే బంతి ముందుకు వెళ్లిపోయింది. చండి మాత్రం క్రీజు వైపు బంతిని విసిరినట్లు సైగ చేశాడు. ఇంతలో వెనకాలే వచ్చిన మరో ఫీల్డర్‌ బంతిని అందుకుని క్రీజ్‌ వైపు విసిరాడు. ఐసీసీ నూతన నిబంధనల ప్రకారం ఫేక్‌ ఫీల్డింగ్‌కు పాల‍్పడితే పెనాల్టీగా ఐదు పరుగులు బ్యాటింగ్‌ జట్టుకు ఇవ్వాల్సి ఉంటుంది.  

ఇక చండిమల్‌ చేసిన పనిపై అంపైర్లు నిగెల్‌ లాంగ్‌-జోయెల్‌ విల్సన్‌లు చర్చిస్తున్న సమయంలో.. డ్రెస్సింగ్‌ రూమ్‌ గ్యాలరీ వద్ద ఉన్న కోహ్లీ పెనాల్టీ కోసం 5 వేళ్లను సంజ్ఞగా చూపించాడు. కానీ, ఫీల్డ్‌ అంపైర్లు మాత్రం అతన్ని పట్టించుకోకుండా పెనాల్టీ ఇవ్వకుండానే ఆటను కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా జెఎల్‌టీ కప్‌ డొమెస్టిక్‌ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్‌ బుల్స్ ఆటగాడు మార్నస్‌ లబుస్‌ఛాగ్నె ఇదే రీతిలో ఫేక్‌ ఫీల్డింగ్‌కు పాల్పడగా.. అంపైర్లు పెనాల్టీ విధించారు. 

మరిన్ని వార్తలు