చండిమల్‌పై ‘ట్యాంపరింగ్‌’ అభియోగం

18 Jun, 2018 05:11 IST|Sakshi
చండిమల్‌

సెయింట్‌ లూసియా: మళ్లీ ‘బాల్‌ ట్యాంపరింగ్‌’ కలకలం చెలరేగింది. ఈసారి వెస్టిండీస్‌ గడ్డపై శ్రీలంక బంతి ఆకారాన్ని మార్చినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ట్విట్టర్‌లో స్పందించింది. లంక కెప్టెన్‌ చండిమల్‌ ఐసీసీ ప్రవర్తన నియమావళిని అతిక్రమించాడని, లెవెల్‌ 2.2.9 ప్రకారం అతనిపై ‘బాల్‌ ట్యాంపరింగ్‌’ అభియోగం మోపుతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (రెండో రోజు ఆట) చివరి సెషన్‌లో చండిమల్‌ తన ఎడమ జేబులోంచి స్వీట్‌ ముక్కల్ని తీసి బంతిపై అదేపనిగా అదిమిపెట్టి రాసినట్లు వీడియో ఫుటేజ్‌లో కనబడినట్లు ఐసీసీ తెలిపింది. మరోవైపు చండిమల్‌ మాత్రం తాను బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశాడు.

ఇకపై కఠిన వైఖరి: బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడితే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ సూచనప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెలలో జరిగే వార్షిక సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇలాంటి అతిక్రమణలపై లెవెల్‌ 2 నుంచి లెవెల్‌ 3కి మార్చి చర్యలు చేపట్టనుంది. అతిక్రమణ లెవెల్‌ 3కి చేరితే ఆటగాడిపై ఏకంగా నాలుగు టెస్టులు, లేదంటే 8 వన్డేల నిషేధం విధిస్తారు.

లంకను ఆదుకున్న మెండిస్‌
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకను కుశాల్‌ మెండిస్‌ (85 బ్యాటింగ్‌) ఆదుకున్నాడు. 34/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మెండిస్, కెప్టెన్‌ చండిమల్‌ (39) ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. కడపటి వార్తలందేసరికి శ్రీలంక 5 వికెట్లకు 194 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు